‘ఉత్తమ విలన్’, ‘గంగ’ సినిమాల విడుదల ఉన్న కారణంగా మే 1న విడుదల కావాల్సిన ‘దొంగాట’ సినిమాను మంచు లక్ష్మి వాయిదా వేసిన విషయం తెల్సిందే.తాజాగా ఈ సినిమాను మే 8న విడుదల చేసేందుకు సిద్దం చేస్తోంది.
మే 8న నందమూరి బాలకృష్ణ ‘లయన్’ సినిమా ఉన్నప్పటికి ఏమాత్రం బెరుకు లేకుండా ‘దొంగాట’ను రిలీజ్ చేసేందుకే మంచు లక్ష్మి మొగ్గు చూపుతోంది.మే 8న ‘లయన్’ విడుదల అవుతుండగా, మే 9న ‘దాగుడు మూతల దండాకోరు’ సినిమా విడుదల అవ్వనుంది.
ఈ రెండు సినిమాలకు తీవ్ర పోటీని ఇచ్చేందుకు ‘దొంగాట’తో మంచు వారి అమ్మాయి బాక్సాఫీస్ ముందుకు రాబోతుంది.
మంచు లక్ష్మి హీరోయిన్‌గా నటించి నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ సినిమాలోని ఒక పాటలో టాలీవుడ్ స్టార్ హీరోలు పలువురు కనిపించనున్నారు.సినిమాకు అది ప్రధాన ఆకర్షణగా నిలువనుంది.
ఇక మంచు లక్ష్మి మొదటి సారి ఈ సినిమా కోసం ఒక పాట పాడటం జరిగింది.అది కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
సినిమాపై నమ్మకం ఉండటం వల్లే ‘లయన్’ వంటి భారీ సినిమాకు పోటీగా విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం ‘దొంగాట’ను వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నారు.
మరి మే 8న విడుదల కాబోతున్న ‘లయన్’, ‘దొంగాట’ సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ను కొల్లగొట్టేనో చూడాలి.