ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీడియాపై చెలరేగిపోయారు.వీరావేశం ప్రదర్శించారు.
ఆగ్రహంతో ఊగిపోయారు.ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసేందుకు మీడియా ‘సుపారీ’ (హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం) తీసుకుందని అన్నారు.
నిజాయితీపరుడిగా పేరు పొందిన ఈ ఢిల్లీ సీఎం ఇంతగా ఎందుకు ఆవేశపడ్డారంటే…ఆయన ప్రభుత్వంలోని న్యాయ శాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ ‘లా’ డిగ్రీ నకిలీదని ఈమధ్య మీడియాలో ప్రముఖంగా వార్త వచ్చింది.తాము తోమర్‌కు లా డిగ్రీ ఇచ్చినట్లు ఆధారాలు లేవని బిహార్ విశ్వవిద్యాలయం అధికారులు కూడా చెప్పారు.
ఈ వార్తను మీడియా ఎక్కువ ఫోకస్ చేయడంతో కేజ్రీవాల్ కోపంగా ఉన్నారు.ఇప్పుడు బయటపడి చివరకు మీడియా ఆప్‌ను హత్య చేసేందుకు సుపారీ తీసుకుందని కూడా ఆరోపించారు.
మీడియా పక్షపాత వైఖరిపై ప్రజా విచారణ జరగాలని కూడా అన్నారు.మీడియాలోని ఓ పెద్ద వర్గం తమ పార్టీ ఇమేజ్ను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఇప్పుడే కాదు, కేజ్రీవాల్‌కు మీడియా అంటే మొదటి నుంచి పడదు.మరి ఆయన అధికారంలో రావడానికి మీడియా పాత్ర లేదా? లేదని ఆయన ఢంకా బజాయించి చెప్పగలడా? తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా మీడియా అంటే చాలా చులకన.ఆయన కూడా మీడియాను పురుగులా చూస్తుంటాడు.ఇలాంటివారు ఇంకా అనేకమంది ఉన్నారు.మీడియా ఎప్పుడూ భజన చేయాలని కేజ్రీవాల్ కోరిక కావచ్చు.