కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార అభివృద్ధికి అందించే పలు పథకాలను మహిళలు వినియోగించుకోవాలి మన నైపుణ్యాలతో పకడ్బందీగా మార్కెటింగ్ చేసుకోవాలి వేములవాడ మండలం అనుపురం గ్రామంలో స్వశక్తి మహిళా సంఘాలకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా: మహిళలు ఆర్థికంగా అభివృద్ది సాధించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.గురువారం జిల్లా కలెక్టర్ వేములవాడ మండలం అనుపురం గ్రామంలో నాబార్డ్ వారి సౌజన్యంతో స్వశక్తి మహిళా సంఘాలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో మిల్లెట్స్ తిను బండారాల తయారీ, టైయిలరింగ్ పై అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను అదనపు కలెక్టర్ పి గౌతమితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా స్వశక్తి మహిళా సంఘాలతో కలెక్టర్ కాసేపు ముచ్చటించారు.మిలెట్స్ వినియోగించు కొని తయారుచేసిన తినుబండారాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మనం తయారు చేసే మిల్లెట్ తినుబండారాలకు బహిరంగ మార్కెట్లో ఉన్న డిమాండ్, మార్కెటింగ్ చేయు విధానం పై కలెక్టర్ చర్చించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సహకరించడానికి పలు పథకాల కింద తక్కువ వడ్డీకి, సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని వ్యాపారాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం టైయిలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళల వివరాలు, టైయిలరింగ్, ఫ్యాషన్ డిజైన్ లో అందిస్తున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.మహిళలు 2 నెలల పాటు టైయిలరింగ్ లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన తర్వాత నైపుణ్యాలను బహిరంగ మార్కెట్లో ప్రణాళిక తో వినియోగించుకోవాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు యూనిఫాంలు, గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ లను కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగిస్తుందని తెలిపారు.మహిళా సంఘాలు ప్రైవేట్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆర్డర్లను సైతం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
హైదరాబాద్ , కరీంనగర్ ,వరంగల్ వంటి పట్టణాలలో ఉన్న వస్త్ర పరిశ్రమలతో అనుసంధానం అవ్వాలని, మార్కెట్ లో మన నైపుణ్యాలను పక్కాగా మార్కెటింగ్ చేసుకోవాలని, వీ హబ్ వంటి సంస్థలను వినియోగించుకొని ప్రైవేట్ ఆర్డర్లను సైతం చేజిక్కించుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
.