యాదాద్రి భువనగిరి జిల్లా:ఎండా కాలంలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ ఈ ఏడాది నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని,నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని, తాగునీటి కోసం ప్రభుత్వం సుమారు 2 కోట్లకు పైగా కేటాయించిందన్నారు.మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ సమస్యలపై అధికారులు అప్రమత్తమై మరమ్మతులు చేపట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
అదే విధంగా పలుచోట్ల ప్రోటోకాల్ లేకుండా శిలాఫలకాలు, బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని,ఇలాంటివి పునరావృతం కావద్దన్నారు.గుండాల మండల కేంద్రంలో సర్పంచ్ పేరు లేకుండా,పదవి కాలం ముగిసిన ఎమ్మెల్యే పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుర్కపల్లి మండలం నుండి యాదగిరిగుట్ట వరకు నిర్మాణం చేస్తున్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఎలక్షన్స్ సమయంలో పార్టీలు ఉండాలని,ఎలక్షన్స్ తర్వాత గ్రామాలు, పట్టణాల అభివృద్ధి పైనే దృష్టి పెట్టాలని కోరారు.