శిల్పం అద్భుతం- చరిత్ర మహాద్భుతం.
కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లోనూ హిందూ దేవుళ్లకు చెందిన పురాతన ఆలయాలు, కళాఖండాలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి.వాటిని భక్తులు దర్శించుకుంటున్నారు కూడా.ఇక దక్షిణ ఆసియాలో అత్యంత పురాతనమైన కళాఖండంగా బుద్ధనీలకంఠ ఆలయం పేరుగాంచింది.నేపాల్ రాజధాని ఖాట్మండుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది.ఇందులో ఉన్న విష్ణువు విగ్రహం సుమారుగా 1400 ఏళ్ల సంవత్సరాల నాటిదని తెలిసింది.

బుద్ధ నీలకంఠ ఆలయంలో ఉన్న విష్ణువు విగ్రహం వెల్లకిలా పడుకుని ఉన్న భంగిమలో ఉంటుంది.ఆ విగ్రహాన్ని ఒకే రాతిపై చెక్కారు.5 మీటర్ల పొడవును ఈ విగ్రహం కలిగి ఉంటుంది.అలాగే ఈ విగ్రహం ఉన్న సరస్సు 13 మీటర్ల పొడవు ఉంటుంది.
అది విష్ణువు శయనించే పాలసముద్రాన్ని పోలి ఉంటుంది.ఇక విష్ణువు విగ్రహం తలపై ఆదిశేషువు 11 తలలు ఉంటాయి.
విష్ణువుకు ఉన్న 4 చేతుల్లో ఒకటి సుదర్శన చక్రాన్ని, మరొకటి శంఖువును, ఇంకొకటి తామరపువ్వును, మరొకటి గదను పట్టుకుని ఉంటాయి.
బుద్ధనీలకంఠ అంటే పురాతనమైన నీలి రంగు గల గొంతు అనే అర్థం వస్తుంది.
ఒకప్పుడు దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మథిస్తే పుట్టిన గరళాన్ని మింగిన శివుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సరస్సులోని నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడట.అందుకే ఈ ప్రాంతానికి బుద్ధ నీలకంఠ అని ఆ పేరు వచ్చింది.
ఇక్కడ ఉన్న సరస్సును గోశయనకుండం అని పిలుస్తారు.ఇక ఈ సరస్సులో ప్రతి ఏటా ఆగస్టులో నిర్వహించే ఉత్సవంలో శివుని ప్రతిరూపం కనిపిస్తుందని చెబుతారు.
అలాగే శివుని ప్రతిబింబాన్ని పోలిన ఓ విగ్రహం కూడా అందులో ఉంటుందట.ఈ విగ్రహాన్ని 6వ శతాబ్దంలో విష్ణుగుప్తుడనే రాజు తెచ్చి ఇక్కడ ప్రతిష్టించాడని చెబుతారు.
క్రీస్తు శకం 540 నుంచి 550 వరకు అతను రాజ్యాన్ని పరిపాలించాడట.

ఆ తరువాత ఒక రైతు తన పొలంలో నాగలితో దున్నుతుండగా, నాగలికి తాకిన విగ్రహం నుంచి రక్తం బయటకు చిమ్మిందట.దీంతో వారు ఆ విగ్రహాన్ని బయటకు తీసి అక్కడే ప్రతిష్టించి పూజించడం మొదలు పెట్టారు.అలా ఆ ప్రాంతంలో పైన చెప్పిన ఆ ఆలయం ఏర్పడిందట.
అయితే నేపాల్‌లో ఆ ప్రాంతాన్ని పాలించిన ఒకప్పటి రాజు ప్రతాప్ మల్ల ఆ ఆలయంలో దైవాన్ని దర్శించుకోలేదట.అలా చేస్తే తనకు మరణం సంభవిస్తుందని అతను నమ్మాడట.
దీంతో అతను అసలు ఆలయం వైపే చూడలేదని చెబుతారు.ఇక ప్రతి ఏటా అక్టోబర్ – నవంబర్ నెలల కాలంలో కార్తీక మాసంలో 11వ రోజు ఈ ఆలయంలో హరిబంధోహిణి ఏకాదశి పేరిట ఉత్సవాలను నిర్వహిస్తారు.
వేల మంది భక్తులు వచ్చి స్వామి వారి ఉత్సవాల్లో పాల్గొని ఆయనను దర్శనం చేసుకుంటారు.అయితే ఆ సమయంలో ఆ ఆలయంలో విష్ణువు సుదీర్ఘ నిద్ర నుంచి లేచి భక్తుల విన్నపాలు వినేందుకు, కోరికలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటాడట.
అందుకనే చాలా మంది భక్తులు విష్ణువును దర్శించుకుంటారు.