హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు.ఈ నేపథ్యంలోనే పార్టీ ఎమ్మెల్సీలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సంవత్సరం వరుసగా వివిధ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పారు.
అలాగే బీఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పని చేయాలన్న కేటీఆర్ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులను శాసనమండలి సభ్యులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పార్టీని పునర్ వ్యవస్థీకరించాలని అధ్యక్షులు భావిస్తున్నారని పేర్కొన్నారు.జిల్లాలు కేంద్రాలుగా పార్టీ కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు.
అలాగే త్వరలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని వెల్లడించారు.శాసనమండలి బీఆర్ఎస్ పక్షనేతను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు.