జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.తన ఎన్నికల ప్రచార రథం వారాహి ద్వారా వివిధ జిల్లాల్లో పర్యటించేందుకు పవన్ షెడ్యూల్ రూపొందించుకున్నారు.
ఈ యాత్రలో భాగంగా వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.దానికి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు.
దీంతో ఏపీలో వైసిపి( YCP ) వర్సెస్ జనసేన అన్నట్లుగా రెండు పార్టీల మధ్య పోరు జరుగుతుంది.అయితే టిడిపి మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయింది.
ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చేస్తున్న ప్రసంగాలపైన టిడిపి పూర్తిగా ఫోకస్ పెట్టింది.గతంలో తనకు ముఖ్యమంత్రి పదవి పై ఆశ లేదని, ఆశపడేందుకు కూడా అర్థం ఉండాలి అంటూ మాట్లాడిన పవన్ ఇప్పుడు మాత్రం తనను ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరుతున్నారు.
టిడిపి , జనసేన( TDP, Jana Sena ) మధ్య పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందనుకుంటున్న సమయంలో, పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనే విషయం తెలుసుకునే పనిలో పడింది.

ఇక పవన్ సైతం అకస్మాత్తుగా తన వైఖరి మార్చుకోవడానికి కారణాలు చాలా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. టిడిపి జనసేన పొత్తు లో భాగంగా టిడిపి బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందన్న సంకేతాలతోనే పవన్ సీఎం పదవి విషయం పై ప్రకటనలు చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.పవన్ తన పర్యటనలో తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాననే విషయం బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
అసలు జనసేన, టిడిపి మధ్య సీట్ల పంపకాల విషయంలో ఎటువంటి పేచీ లేకపోయినా , ముఖ్యమంత్రి పదవి విషయంలోనే అసలు పేచీ నెలకొన్నట్లుగా తెలుస్తుంది.ఈనెల 14 నుంచి 27వ తేదీ వరకు అన్నవరం నుంచి నరసాపురం వరకు యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది.

పవన్ ఈ యాత్రలో పూర్తిగా వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తారని అంతా భావించినా, పవన్ మాత్రం తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను అంటూ మాట్లాడడం టిడిపికి షాక్ ఇచ్చినట్లు అయ్యింది .అంతేకాదు జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా తాను యాత్ర చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండడం, ఇతర పార్టీలకు జనసేన పార్టీకి ఉన్న వ్యత్యాసం గురించి ప్రజలకు వివరిస్తూ ,వర్గ రాజకీయాలను దాటి రాజకీయం చేయాలని పార్టీ నేతలకు పవన్ సూచిస్తుండడం, ఒక కులానికి ఒక పార్టీ అన్న భావన తప్పు అంటూ చెబుతుండడం వంటి విషయాలను టిడిపి సీరియస్ గా తీసుకుంటుంది.తనను ఒక్కసారి ముఖ్యమంత్రి చేసి చూడాలని, తన పాలన బాగాకపోతే తానే రాజీనామా చేస్తానంటూ పవన్ ప్రజలను వేడుకోవడం వంటి విషయాలపై టిడిపి లోతుగానే విశ్లేషణ చేస్తుంది.మొన్నటి వరకు పదవిపై ఆశ లేదని చెబుతూనే , ఇప్పుడు సీఎం కావాలి అనుకుంటున్నాను అంటూ మాట్లాడడంతో సీఎం పదవి, సీట్ల విషయంలో తాము తగ్గేదే లేదని, తాము కోరిన చోట, కోరినన్ని సీట్లు ఇవ్వాల్సిందే అనే హెచ్చరికలు టీడీపీ , ఆ పార్టీ అధినేత చంద్రబాబు కు ఇస్తున్నట్లుగా పవన్ వ్యాఖ్యలను భట్టి అర్థం అవుతోంది.