బ్రిటీష్ కర్రీ అవార్డ్స్ వేడుకలో భారతదేశంపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలకు సంబంధించి యూకే వ్యాపారవేత్త చార్లీ ముల్లిన్స్ (70) క్షమాపణలు చెప్పారు.భారత సంతతికి చెందిన టీవీ ప్రెజెంటర్ రంజ్ సింగ్‌తో పాటు కమ్యూనిటీ నుంచి తీవ్ర ప్రతిస్పందనలు రావడంతో చార్లీ దిగివచ్చారు.
లండన్‌లోని అతిపెద్ద ప్లంబింగ్ కంపెనీ అయిన పిమ్లికో ప్లంబర్స్‌ను ఆయన స్థాపించారు.ఈ సందర్భంగా కర్రీ అవార్డ్స్ వేడుకలో క్రిస్ టరెంట్, మెర్లిన్ గ్రిఫిత్స్, నీనా వాడియా, రంజ్ సింగ్ తదితరులతో కలిసి పాల్గొన్నారు.
బ్రిటీష్ కర్రీ అవార్డ్స్‌కు అతిథిగా రావడం తనకు దక్కిన గౌరవమన్నారు చార్లీ.కష్టపడి పనిచేసే పారిశ్రామికవేత్తల సమూహంతో కలిసి అద్భుతమైన సాయంత్రాన్ని గడిపానని ముల్లిన్స్ ఒక ప్రకటనలో అన్నారు.ఆరోజు తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, ఒకవేళ ఎవరి మనుసులైనా గాయపడితే క్షమించాలని కోరారు.
కాగా… బ్రిటీష్ కర్రీ అవార్డ్స్ ఫంక్షన్‌లో ముల్లిన్స్ మాట్లాడుతూ… భారత్ ఎందుకు ప్రపంచకప్ గెలవలేకపోతుందని ప్రశ్నించారు.దీనిపై భారత సంతతి వ్యాఖ్యాత రంజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అవార్డుల వేడుకలో అసౌకర్యానికి గురైన ఏకైక వ్యక్తిని తానేనంటూ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.దీనిపై తాను మౌనంగా వుండలేనని, వేదికపై వున్నవారంతా 90 శాతానికి పైగా తెల్లవారేనని .తాము నిజంగా మా సంఘానికి ప్రాతినిథ్యం వహిస్తున్నామా అని అవార్డ్ నిర్వాహకులను ప్రశ్నించారు.భారతదేశం గురించి ఒక తెల్లజాతి వ్యక్తి జోక్ చేశాడని.ఇది ఏ విధంగా కరెక్ట్ అంటూ రంజ్ సింగ్ ప్రశ్నించారు.
తన భారతీయ వారసత్వం, భారతీయ సమాజం, తనకంటే ముందు బ్రిటన్ గడ్డపైకి వచ్చిన వారిని చూసి తాను గర్వపడుతున్నానని ఆయన అన్నారు.అందుకే ఇలాంటి వ్యాఖ్యలపై తాను మౌనంగా వుండలేనని ఆయన లేఖలో అన్నారు.అయితే తామేమీ విమర్శలకు అతీతం కాదని.కానీ తాము నేర్చుకోవడానికి, ఎదగడానికి సిద్ధంగా వున్నామని రంజ్ సింగ్ ముగించారు.ఈ లేఖతో భారత కమ్యూనిటీ కూడా భగ్గుమంది.మాజీ క్రైమ్ వాచ్ హోస్ట్ రావ్ వైల్డింగ్ సైతం చార్లీపై మండిపడ్డారు.
సర్వత్రా విమర్శలు రావడంతో చార్లీ క్షమాపణలు చెప్పారు.