ప్రస్తుతం ఏపీలో రాజకీయాలన్ని అమరావతి, మూడు రాజధానుల చుట్టూనే తిరుగుతున్నాయి.అమరావతికి మద్దతుగా జనసేన, టిడిపి , బిజెపిలు ఉండగా ఏపీ అధికార పార్టీ వైసీపీ మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని ప్రకటనలు చేస్తుంది.
ప్రస్తుతం మహా పాదయాత్ర పేరుతో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు అమరావతి టు అరసవల్లి పాదయాత్రను నిర్వహిస్తున్నారు.యాత్ర ఇప్పటి వరకు సజావుగానే సాగుతున్నా, ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
అమరావతి ప్రాంత రైతుల యాత్రకు వ్యతిరేకంగా వైసిపి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జన నిర్వహించబోతున్నారు.అదే రోజు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. దీంతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది.మూడు రాజధానులకు మద్దతుగా వైసిపి ప్రజా ప్రతినిధులు అంతా ప్రకటనలు చేస్తుండగా, అమరావతికి జై కొడుతూ మిగిలిన రాజకీయ పార్టీలు ప్రకటనలు చేస్తున్నాయి.
ఇంతవరకు బాగానే ఉన్నా అమరావతి ని సమర్థిస్తూ, మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ టిడిపి, జనసేన పార్టీలు గట్టిగానే ప్రకటనలు చేస్తున్నాయి.అయితే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు, కృష్ణ గుంటూరు జిల్లాల వరకు టిడిపి జనసేనకు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
అమరావతికే కట్టుబడి ఉన్నామని చెబుతుండటం తో మిగిలిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆ పార్టీలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగానే ఉంది.విశాఖ ను పరిపాలన రాజధాని గాను, కర్నూలు ను న్యాయ రాజధానిగాను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో స్పష్టంగా టిడిపి , జనసేన పార్టీలు చెప్పలేకపోతున్నాయి.
అదే సమయంలో మూడు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామో జగన్ స్పష్టంగా చెబుతున్నారు.అభివృద్ధి మొత్తం అమరావతి వరకే పరిమితం చేస్తే మిగిలిన ప్రాంతాలు పరిస్థితి ఏమిటని.అందుకే ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర , కోస్తా జిల్లాలను అభివృద్ధి చేసేందుకు మూడు జిల్లాలు ప్రతిపాదన తెచ్చామని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తాము బలంగా కోరుకుంటున్నామని జగన్ పదేపదే చెబుతున్నారు.ప్రస్తుతం అమరావతి విషయంలో టిడిపి , జనసేనలు హైలెట్ అవుతున్నా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులే తలెత్తే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడం రెండు పార్టీలకు ఇష్టం లేదేమో అన్న అభిప్రాయం జనాల్లో కలిగితే ఎన్నికల సమయంలో తీవ్రంగానే నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి జనసేన టిడిపి లకు ఉంది.