తెలుగుదేశం పార్టీని సమూల ప్రక్షాళన చేసి 2024 ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకోవాలనే ఆలోచనతో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు డిసైడ్ అయిపోయారు.ఈ మేరకు పార్టీని సమూల ప్రక్షాళన చేపట్టి పార్టీలో ఉన్న నాయకులు అందరిని యాక్టివ్ చేయాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తునే ఉన్నారు.2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో బాబు ఘాటుగానే పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారు.నియోజకవర్గాల్లో కీలకంగా పనిచేయాలని, ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై స్థానిక నేతలు అంతా పోరుబాట పట్టాలని బాబు పదేపదే పిలుపునిస్తున్న, చాలామంది నియోజకవర్గ కీలక నాయకులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం, మీడియా సోషల్ మీడియాలో హడావిడి చేయడం తప్పించి క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడం ఇవన్నీ బాబు గుర్తించారు.
ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా పార్టీలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని బాబు ఆరా తీస్తున్నారు.తాజాగా జరిగిన సమావేశంలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రాబోయే ఎన్నికల్లో పని చేసిన వారికి మాత్రమే సీట్లు ఇస్తామని, నటించేవారిని పక్కన పెడతానని హెచ్చరించారు.పార్టీ కార్యక్రమాలు చేయకుండానే చేస్తున్నట్లు నటిస్తున్న వారు ఎవరెవరో తన దగ్గర జాబితా ఉందని, ఆ ప్రకారం చర్యలు తీసుకోవడం పక్క అని బాబు హెచ్చరించారు.
నటించే నాయకులు తనకు అవసరం లేదని పార్టీ కోసం కష్టపడుతూ , మూడు సంవత్సరాలు జైలుకు వెళ్లి పోలీసులు దెబ్బలు తిన్న నాయకులే తనకు కావాలని, మొదటి శ్రేణి నాయకులంతా ఇంట్లో కూర్చుంటే ద్వితీయ శ్రేణి నాయకులంతా పార్టీ కోసం కష్టపడ్డారని, వారికే తాను మొదటి ప్రాధాన్యం ఇస్తానని బాబు స్పష్టం చేశారు.
తాను ఎన్నిసార్లు హెచ్చరించినా, పార్టీ సీనియర్ నేతల పనితీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని మండిపడ్డారు.కొన్నిచోట్ల పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించామని, మరి కొన్ని చోట్ల పార్టీ కోసం కష్టపడిన వారిని ఇన్చార్జిలుగా నియమిస్తామని రాబోయే ఎన్నికల్లో ఇంచార్జిలే పార్టీ అభ్యర్థుల అవుతారని బాబు క్లారిటీ ఇచ్చారు.అలాగే ప్రతి నియోజకవర్గానికి పోలీసుల కేసుల నుంచి కాపాడేందుకు నాయకుల కోసం న్యాయవాదుల నియామకాన్ని చేపట్టబోతున్నట్టు బాబు ప్రకటించారు.
చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలపై పార్టీలో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు బాబుకు అందుతున్నడంతోనే ఆయన ఈ స్థాయిలో ఫైర్ అవుతున్నారని , ఏ నాయకుడు ఏం చేస్తున్నారనే విషయం బాబుకు స్పష్టంగా తెలిసిపోతోందనేది బాబు తాజా వ్యాఖ్యలతో అందరికీ అర్థమైంది.