మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మార్పు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే ఉంది.ఆయన పార్టీ మారితే గనుక తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయం అనే అభిప్రాయంతో అన్ని పార్టీలు ఉండడంతో, ఆ మేరకు ముందుగానే ఎన్నికలకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు.
టిఆర్ఎస్ కాంగ్రెస్ వంటి పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి.అంతేకాకుండా కాంగ్రెస్ తెలంగాణ శాఖ ఈ విషయంలో అలర్ట్ గా ఉంది.
మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించి మళ్లీ తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన అధిష్టానం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినా.
ఇప్పుడు మాత్రం రాజగోపాల్ రెడ్డి విషయంలో వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తున్నారు.ఇక రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరనున్నట్లు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
అయితే రాజగోపాల్ రెడ్డి పై మొదట్లో చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ భావించినా, ఇప్పుడు ఆయన విషయంలో చర్చలు జరపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు టి.పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని బొజ్జగించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాజగోపాల్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంతనాలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈరోజు ఉదయం రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.రెండు రోజుల్లో ఢిల్లీకి రావాలని, అక్కడ మాట్లాడుకుందామని కాంగ్రెస్ లో మీకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి అనేది ఆ సమావేశంలో చర్చిద్దామని ఆహ్వానించారట.ఇక రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడకుండా చూసే బాధ్యతను ఉత్తంకుమార్ రెడ్డికి అప్పగించడంతో ఆయన చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ఇప్పటికే బీజేపీలో చేరేందుకు దాదాపు అన్ని రకాలుగా సిద్ధమైన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల బుజ్జగింపుతో మనసు మార్చుకుంటారా లేదా అనేది వేచి చూడాలి .