పిల్లల జీవితాలపై తల్లిదండ్రుల ప్రభావం బలంగా పడుతుంది.చిన్నప్పటి నుంచి వారిని చూసే పిల్లలు పెరుగుతారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికైనా రోల్‌మోడల్స్ తల్లిదండ్రులే.వారు చేస్తున్న ఉద్యోగాలు, పనులనే చాలా మంది పెద్దయ్యాక చేస్తూ వుంటారు.
లేదంటే తమ తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లుగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని ముక్త్సర్కి చెందిన మంజిత్ కౌర్ ఆమె కుమార్తె ఖుష్రూప్ కౌర్ సంధులు అరుదైన ఘనత సాధించారు.
రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన తల్లీకూతుళ్లుగా వారిద్దరూ రికార్డుల్లోకెక్కారు.ఈ సందర్భంగా ఖుష్రూప్ బంధువు గుర్సాహిబ్ సింగ్ మాట్లాడుతూ.ఇది తమ కుటుంబానికి రెట్టింపు ఆనందాన్ని కలిగించిందన్నారు.పంజాబ్‌కు చెందిన మంజిత్, ఖుష్రూప్లు ఆస్ట్రేలియా వైమానిక దళంలో సేవలందించే అవకాశం పొందిన మొదటి తల్లీకూతుళ్లని చెప్పారు.
పన్నెండో తరగతి పూర్తి చేసిన తర్వాత ఖుష్రూప్.రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందని ఆమె అమ్మమ్మ పరమ్‌జిత్ కౌర్ అన్నారు.శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఆమె సైబర్ క్రైమ్ విభాగాన్ని ఎంచుకుందని తెలిపారు.అమ్మాయిలు అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని.
తమ కుటుంబంలోని మహిళల ఎదుగుదలకు తాము ఎన్నడూ అడ్డూ చెప్పలేదని పరమ్‌జిత్ తెలిపారు.

ఖుష్రూప్ తల్లి మంజిత్ .డార్విన్ ఎయిర్‌బేస్‌లో రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్ విభాగంలో ఎయిర్‌క్రాఫ్ట్ ఉమెన్‌గా సేవలందిస్తున్నారు.ఆమె భర్త రూప్ సింగ్ సంధు కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వ ఉద్యోగే కావడం విశేషం.ఈ జంట 2009లో స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లారు.2013లో ఆస్ట్రేలియా శాశ్వత వీసాను పొందిన అనంతరం.తమ ఇద్దరు కుమార్తెలను కూడా అక్కడికి తీసుకెళ్లారు.