ఖమ్మం: నిరుద్యోగుల పాలిట ఆపద్భాందువు సీఎం కేసీఆర్ అని తెరాస రాష్ట్ర నాయకులు , ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.బుధవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు ఇచ్చిన వరాల జల్లుపై పొంగులేటి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా కొణిజర్ల మండల పర్యటనలో ఉన్న ఆయన జిల్లా, స్థానిక తెరాస నాయకులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని శాఖాల్లో ఉన్న కొలువుల భర్తీకి సీఎం కేసీఆర్ పూనుకోవడం శుభపరిణామమన్నారు.
ఇప్పటికే లక్షాన్నరకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వం త్వరలో 90వేలకు పైగా ఖాళీలున్న ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టడంతో ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా పోతుందన్నారు.కాంట్రాక్టు ఉద్యోగులను సైతం క్రమబద్దీకరణ చేస్తామని చెప్పడంతో వారి ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయన్నారు.
ఎంతగానో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు సీఎం కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని తెలిపారు.అన్నింటి కంటే ముఖ్యంగా వయోపరిమితిని పెంచడం పట్ల అన్ని వర్గాల నిరుద్యోగ యువతనుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఘనతగా చెప్పుకోవచ్చని పొంగులేటి తెలిపారు.