కొందరు ప్రజలు తమ కొంటె, మూర్ఖపు చేష్టలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు.తాజాగా ఇలాంటి వ్యక్తికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వ్యక్తి కావాలనే ఓ పిచ్చి పని చేసి అందరి చేత తిట్లు తిట్టించుకుంటున్నాడు.దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఈ వీడియోలో ఆందోళనకు గురైన ఒక చిరుతపులితో ఆట ఆడాలనుకున్నాడు ఓ వ్యక్తి.కానీ అది అతన్ని చంపడానికి ప్రయత్నించింది.
ఈ ఘటనలో అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.దీని గురించి వ్యాఖ్యానిస్తూ.“క్రూర మృగాలకు దగ్గరగా వెళ్లకూడదు.మరీ ముఖ్యంగా ఆందోళనలో ఉన్న అడవి జంతువులను గెలకకూడదు” అని సుశాంత్ నందా పేర్కొన్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో… ఒక ఇనుప బోనులో బంధించి ఉన్న చిరుత పులిని చూడవచ్చు.అప్పటికే అది చాలా అగ్రెసివ్ గా ఉంది.జనారణ్యంలోనే ఈ బోను ఉండటంతో చాలామంది ప్రజలు అక్కడికి చేరుకుని చిరుత పులిని చూడసాగారు.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఒక చెట్టు కొమ్మను పట్టుకొని చిరుత బోనులోకి దూర్చి దాన్ని ఆట పట్టించాడు.
అయితే అప్పటికే పులి గట్టిగా గండ్రిస్తూ సదరు వ్యక్తిని భయపెట్టింది.అయినా కూడా అతడు అలాగే చిరుతని చెట్టు కొమ్మతో కొడుతూనే ఉన్నాడు.
ఈ సమయంలోనే ఆ పులి చెట్టు కొమ్మను నోటితో పట్టుకొని గట్టిగా లాగింది.అంతే రెప్పపాటు సమయంలో అతడు బోనుకు అతుక్కుపోయాడు.
అయితే అతడు దగ్గరికి రాగానే పంజాతో కసితీరా కొట్టి తీవ్రంగా గాయపరిచింది చిరుత.ఇంకా తీవ్రమైన దాడి చేసేందుకు చిరుత ప్రయత్నిస్తుండగా అక్కడ స్థానికులు అతన్ని వెంటనే బోను నుంచి దూరంగా తీసుకువచ్చారు.
అప్పటికే సదరు వ్యక్తి చేతికి గాయమై రక్తం వరదలా కారుతోంది.ఈ దృశ్యాలన్నీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో కనిపించాయి.
ఈ వీడియో చూసి నెటిజన్లు సదరు వ్యక్తికి తగిన శాస్తి జరిగిందని కామెంట్లు పెడుతున్నారు.మరికొంతమంది అదృష్టం కొద్దీ అతను బతికి పోయాడని కామెంట్లు చేస్తున్నారు.
ఈ షాకింగ్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.