ఈ కాలంలో పిల్లల్ని పెంచడం అనేది ఒక పని లాగా భావిస్తున్నారు.కానీ పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యతలాగా స్వీకరించడం లేదు.
పూర్వకాలంలో పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించేవారు.తల్లి పాల దగ్గర నుండి, బిడ్డ మల మూత్రాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ ఎంతో కేరింగ్ గా చూసుకునేవారు.
కానీ ఈ కాలంలో మాత్రం బిడ్డల పెంపకం విషయంలో చాలా మార్పులు వచ్చాయి.ముఖ్యంగా పిల్లలకు వాడే డైపర్స్ విషయంలో.
ఎందుకంటే పిల్లలు ఎక్కడ టాయిలెట్ కి వెళతారో అనే భయంతో ఎంత ఖర్చు అయినా సరే వెనకాడకుండా డైపర్లు తొడిగేస్తున్నారు.ఇప్పుడంటే డైపర్లు వేస్తున్నారు కానీ పూర్వకాలంలో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చెప్పండి.
ఎంచక్కా అమ్మ కాటన్ చీరనో లేక అమ్మమ్మ, నాన్నమ్మ లా కాటన్ చీరనో చక్కగా ఉతికి ఆ చీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లలకు పక్కలాగా వేసేవారు.కానీ ఇప్పుడు అలా ఎవరు చేస్తున్నారు చెప్పండి.
అటు తల్లికి ఇటు పిల్లాడికి శ్రమ లేకుండా ఎంచక్కా డైపర్లు వేసేస్తున్నారు.బయటకు వెళ్లిన్నప్పుడు పాపాయి టాయిలెట్ పోస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి డైపర్ వేయడంలో తప్పులేదు.
బయట నుంచి రాగానే బాబుకి వేసిన డైపర్ తీసిపారేస్తే ఏ ఇబ్బంది ఉండదు.కానీ కొంతమంది పేరెంట్స్ పిల్లాడికి రోజంతా డైపర్లు వేసే ఉంచుతారు.
అలాంటప్పుడే పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.కొంతమంది తల్లితండ్రులు రాత్రిపూట పిల్లలు టాయిలేట్ పోస్తే ఎక్కడ అర్ధరాత్రి లేవాల్సి వస్తుందో అని డైపర్లు వేస్తారు.
ఇలా డైపర్ లు వేయడం వల్ల రాత్రంతా బిడ్డతో పాటు తల్లి తండ్రులు కూడా లేవకుండా హాయిగా పడుకోవడం వరకు బాగానే ఉంది.కానీ అలా రాత్రంతా డైపర్లు ఉంచడం వలన వాటి నుంచే విడుదల అయ్యే వ్యర్థాలు పిల్లల సున్నితమైన చర్మానికి అంటుకు పోతాయి.
ఫలితంగా పిల్లలకు రాషెస్ వస్తాయి అలాగే వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
అంతేకాకుండా ఈ డైపర్ల వలన పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది.క్లాత్ డైపర్‌లకు బదులుగా ఈ డిస్పోజబుల్ డైపర్ లు వాడడం వలన అవి భూమిలో కలవడానికి దాదాపు 250-300 ఏళ్ల సమయం వరకు పట్టవచ్చు.ఫలితంగా డైపర్ వలన పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతుంది.
అలాగే ఈ డైపర్లను పిల్లలు ఎక్కువసేపు ధరించడం వల్ల అవి సున్నితమైన చర్మానికి హాని కలిగిస్తాయి.అందుకే సరైన సమయంలో తల్లిదండ్రులు డైపర్‌లను ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి.
సాధారణంగా శిశువు చర్మం మృదువుగా ఉంటుంది.అలాంటప్పుడు మనం డైపర్ వేసినపుడు గాలి సరిగా వెళ్లదు.
దాంతో శిశువు చర్మం తడిగా ఉండడం వలన ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వస్తాయి.
ఈ డైపర్లు వాడడం వలన పిల్లలో టాయిలేట్ ట్రైనింగ్ ఆలస్యం అవుతుంది.డైపర్ అలవాటు అవ్వడం వలన డైపర్ ఉంది అనుకుని పిల్లలు టాయిలెట్ పోసేస్తారు.అందుకే టాయిలెట్ విషయంలో పిల్లలకు ముందుగానే అవగాహన కల్పించాలి.
అలాగే డైపర్ కంపెనీలు కూడా మీ పిల్లలకు డైపర్లు వాడిన తర్వాత వాటిని కాస్త క్లీన్ చేసి పారవేయండి అని చెబుతున్నాయి.కానీ 99% మంది అలాగే డైరెక్ట్ గా డస్ట్ బీన్ లో పార వేయడం వలన అవి మురుగు నీటిలో కలిసి పోకుండా అలాగే ఉండిపోతూ గాలిని, మట్టిని కలుషితం చేస్తున్నాయి.పిల్లలకు వేసే ఒక్కో డైపర్ రూ.10-15 ధర పలుకుతుంది.అయినా గానీ కొంటున్నాం.దీన్నే డబ్బులిచ్చి మరి అనారోగ్యాన్ని కొనుకోవడం అంటారు కాబోలు.