కాంగ్రెస్ లో నాయకుల మధ్య వివాదాలు నిత్య కృత్యం గా మారిపోయాయి.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీకి చెడ్డపేరు తీసుకురావడం.
అధిష్టానం కలుగజేసుకోవటం.అసంతృప్త నేతలు మధ్య సర్దుబాటు జరగడం ఇవన్నీ సర్వసాధారణంగా మారిపోయాయి.
నిన్ననే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.రేవంత్ ఒక్కరే పార్టీలో హీరో అనుకుంటున్నారనే వ్యాఖ్యలతో పాటు, మరెన్నో సంచలన విమర్శలు చేశారు.
ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపాయి.ముఖ్యంగా సీనియర్లు వర్సెస్ రేవంత్ వర్గం అన్నట్లుగా పరిస్థితి తయారవడం, పార్టీలో క్రమశిక్షణ మళ్ళీ అదుపుతప్పి నట్లుగా కనిపించడం తదితర పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం అలెర్ట్ అయింది.
ముఖ్యంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది.ఈ తరహా రాజకీయాలకు చెక్చ్ పెట్టాల్సిందిగా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి సూచించడంతో ఆయన రంగంలోకి దిగారు.
ఈ మేరకు జగ్గారెడ్డి తో ఏఐసిసి ఇంచార్జి కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాసన్ కృష్ణన్ విడివిడిగా సమావేశం అయ్యారు.అసలు రేవంత్ రెడ్డి పై ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో జగ్గారెడ్డి ని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జగ్గారెడ్డి, మల్లు రవి తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీలో జరిగే అంతర్గత వ్యవహారాలను మీడియాతో మాట్లాడవద్దని పార్టీ పెద్దలు సూచించారు అని, రేవంత్ ను ఉద్దేశించి తాను శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తప్పేనని, దానికి సారి కూడా చెప్పానని జగ్గారెడ్డి చెప్పారు.
ఇకపై పార్టీలో మేమంతా అన్నదమ్ములు మాట్లాడుకుంటాము అని, కలిసి పని చేస్తామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు.అసలు నాయకుల మధ్య వివాదం ఏర్పడడానికి కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అని, మరోసారి ఈ తరహా పరిస్థితి రాకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అన్నారు.స్వయంగా కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగడంతో జగ్గారెడ్డి నిన్నటి వ్యవహారానికి సారీ చెప్పి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించేసారు.అయితే తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఎప్పుడూ ఈ తరహ బేధాభిప్రాయాలు వస్తూనే ఉంటాయనేది అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది.