న్యూఢిల్లీ: ఒకవైపు దోహాలో భారత్‌తో చర్చలు జరిపిన తాలిబన్లు… మరోవైపు కాశ్మీర్ అంశంపై వివాదాస్పద ప్రకటనలు చేశారు.చైనాలో ఉఘుర్ ముస్లింల అణచివేతపై మౌనం వహించిన తాలిబన్లు, జమ్మూకశ్మీర్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా తమవారేనని, వారి కోసం మాట్లాడే హక్కు తమకు ఉందని ప్రకటించారు.
తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ ఈ విధమైన ప్రకటన చేశారు.కాశ్మీర్ అంశంపై అల్కైదా తమ సహాయం కోరినట్లు తాలిబన్లు ప్రకటించిన నేపధ్యంలో, వారు ఈ కొత్త వివాదానికి తెరలేపారు.
అయితే ఇంతకుముందు తాలిబన్ నేతలు తాము భారత్, పాక్ వ్యవహారంలో తలదూర్చమని తెలిపారు.అలాగే ఆ ప్రాంతాన్ని ఏ దేశానికీ వ్యతిరేకంగా ఉపయోగించడానికి తాము సమ్మతించమని తెలిపారు.
మీడియాతో తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌లోని ముస్లింల కోసం మాట్లాడే హక్కు తమ సంస్థకు ఉందని స్పష్టం చేశారు.
అమెరికాతో దోహా ఒప్పందాన్ని ప్రస్తావించిన ఆయన ఏ దేశానికీ వ్యతిరేకంగా సాయుధ ప్రచారాన్ని ప్రారంభించబోమని పేర్కొన్నారు.
ఒక ముస్లింగా, భారత్‌లోని కశ్మీర్ లేదా మరే ఇతర దేశాలలోని ముస్లింల కోసం మాట్లాడే హక్కు తమకు ఉందని షాహీన్ పేర్కొన్నారు.ముస్లింల సమానత్వం కోసం అన్ని దేశాలకు విజ్ఞప్తి చేస్తామన్నారు.
ఆగస్టు 31 న భారత్ మొదటిసారిగా తాలిబన్లతో అధికారిక చర్చలు జరిపింది.