ఏపీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు సంచలనంగానే ఉంటూ వస్తున్నాయి.పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతగానో వివాదాస్పదం అయ్యాయి.
చాలావరకు కోర్టుల్లోనూ, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి.జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఏదైనా ఉందా అంటే అది ఏపీ శాసన మండలి రద్దు.
మండలిలో టీడీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో, జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, శాసనసభలో ఆమోదం పొందినా, మండలిలో మాత్రం దానికి టీడీపీ సభ్యులు బ్రేకులు వేసేవారు.తరచుగా ఇదే తంతు చోటు చేసుకుంటూ ఉండడంతో అసహనానికి గురైన జగన్ శాసన మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసి, ఆ బంతిని కేంద్రం కోర్టులో వేశారు.
ఏపీ శాసన మండలిని రద్దు చేసే విధంగా లోక్ సభ, రాజ్యసభలో ఆమోదముద్ర వేయాలని కోరారు.అయితే అది ఇంకా పెండింగ్ లోనే ఉంది.
ఇప్పుడు మండలిలో వైసిపి బలం బాగా పెరిగింది.టీడీపీ కంటే వైసీపీ బలం ఎక్కువగా ఉంది.
ఇక మండలిలోనూ జగన్ నిర్ణయాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.దీంతో మండలి రద్దు అంశంపై జగన్ సైలెంట్ అయిపోగా, ఇప్పుడు అదే అంశంపై పై వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీడీపీ విమర్శలు చేస్తున్నాయి.
మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉండాలని, వెంటనే రద్దు చేయించే దిశగా జగన్ ప్రయత్నించాలి అంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తుండడం తో వైసిపి ఇరకాటంలో పడింది.
గతంలో తాము మండలిని రద్దు చేయాలని కోరినా, దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.కానీ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి లేకపోవడంతో పాటు, మండలి అవసరం కూడా వైసీపీకి ఉండడంతో, ఈ విషయం లో సైలెంట్ అయిపోయింది.కానీ టీడీపీ మాత్రం ఈ విషయాన్ని వదిలి పెట్టకుండా జగన్ ని ఇరకాటంలో పెడుతోంది.
దీంతో జగన్ అప్పుడు మండలి వద్దు రద్దే ముద్దు అన్నారు.ఇప్పుడేమో మండలి ఉండాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.