తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంతో పాటు, ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు.సీనియర్ నాయకులు తమకు అన్ని విషయాల్లోనూ సహకారం అందించకపోయినా, సర్దుకుపోతూ ఎప్పటికప్పుడు సరికొత్త రాజకీయ వ్యూహాలు రూపొందించుకుంటూ, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు వెళుతున్నారు.
పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు తనకు తగిన ప్రోత్సాహం అందిస్తూ ఉండడం, మునుగోడు ఎన్నికల ఫలితాలు తర్వాత పార్టీ సీనియర్ నాయకుల మాటలను పక్కనపెట్టి , తనకు అన్ని విషయాలలోను స్వేచ్ఛను కల్పించడంతో రేవంత్ మరింత యాక్టివ్ అయ్యారు.ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ, కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనే విషయంపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు బిజెపి టిఆర్ఎస్ లు ఏ విధంగా కుట్ర పన్నుతున్నాయో రేవంత్ వివరించే ప్రయత్నం చేశారు.గాంధీభవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్ లు, అధ్యక్షులతో జరిగిన సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అనేక అంశాలపై రేవంత్ మాట్లాడారు.పార్టీలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని, అందరం సహచరులమేనని రేవంత్ చెప్పుకొచ్చారు.ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో అనుబంధ సంఘాల పాత్ర కీలకమని, గతంలో చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్తు ప్రణాళికలపై పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు.ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున అందరూ బాధ్యతగా ముందుకు వెళ్లాలంటూ సూచించారు.
ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు బిజెపి టిఆర్ఎస్ లు ప్రయత్నిస్తున్నాయి అనే విషయాన్ని అర్థమయ్యేలా వివరించాలని రేవంత్ సూచించారు.టిఆర్ఎస్, బిజెపిలు పైకి ప్రత్యర్థులుగా వ్యవహరిస్తున్నా, రెండు పార్టీలు ఒకటేనని , కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడమే ఈ రెండు పార్టీల ఏకైక లక్ష్యం అంటూ రేవంత్ పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు.







