తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలలో ఒకరిగా దిల్ రాజు తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్నాడు.దిల్ రాజు అంటే తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడు.
ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోతో సినిమా చేసి ఏదో ఒక రూపంలో ఆయా హీరోల ఫ్యాన్స్ కు దిల్ రాజు సుపరిచితం.సినిమా పరిశ్రమలో ఒకటి రెండు సినిమాలు తీయడమే చాలా పెద్ద విషయంగా భావిస్తారు.
కాని గత 18 సంవత్సరాలుగా రకరకాల స్టోరీలను ఎన్నుకుంటూ వాటిని తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక శైలిని ఏర్పరచుకొని దిల్ రాజు సినిమా ఒకే చేసాడంటే ఆ సినిమా హిట్ అనేంతలా ప్రేక్షకులలో కావచ్చు, సినిమా పరిశ్రమలో కావచ్చు ఒక స్పష్టమైన ముద్ర వేసాడు దిల్ రాజు.సాధారణంగా అగ్ర నిర్మాతలు ఎక్కువ సేఫ్ జోన్ లో ఉండడానికి ప్రయత్నిస్తారు.
కాని దిల్ రాజు రూటే సెపరేటు కదా.ఎక్కడ ఎవరి దగ్గర మంచి స్టోరీ నచ్చినా కొత్త దర్శకుడైనా సరే అతనిని నమ్మి కోట్లు ఖర్చు పెట్టగలిగే దమ్మున్న నిర్మాత దిల్ రాజు.ఇలా ఇప్పటివరకు ఓ పది మంది కొత్త దర్శకులను పరిచయం చేసారనే చెప్పవచ్చు.బొమ్మరిల్లు సినిమా ద్వారా బొమ్మరిల్లు భాస్కర్ ను, ఆర్య సినిమా ద్వారా సుకుమార్ ను, ఓ మై ఫ్రెండ్ ద్వారా వేణు శ్రేరాం, మున్నా సినిమా ద్వారా వంశీ పైడిపల్లి, పాగల్ సినిమా ద్వారా నరేష్ కుప్పిలిని, జాను రీమేక్ ద్వారా ప్రేమ్ కుమార్ ను, వరుణ్ సందేశ్ హీరోగా నటించిన మరో చరిత్ర సినిమా ద్వారా రవి యాదవ్ ను దర్శకులుగా తన స్వంత ప్రొడక్షన్ ద్వారా దిల్ రాజు వెండి తెరకు పరిచయం చేసారు.