సంఘ సేవకుడు, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతర పోరాటం చేసిన వ్యక్తి సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ అనారోగ్యంతో మృతి చెందారు.మతతత్వ పోకడలని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులలో స్వామి అగ్నివేశ్ ముందు వరుసలో ఉంటారు.
ఆర్య సమాజ్ నేతగా, ఆర్యసభ అనే పార్టీ పెట్టి హర్యానా రాష్ట్రం తొలి విద్యాశాఖ మంత్రిగా పని చేసిన స్వామి అగ్నివేశ్ తరువాత కొన్ని పరిస్థితులలో మంత్రి పదవికి రాజీనామా చేసి జనం మధ్యకి వచ్చేశారు.అప్పటి నుంచి సామాజిక ఉద్యమకారుడుగా ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం అయ్యాడు.
మావోలు, పోలీసులకి మధ్య ఉమ్మడి ఏపీలో చర్చలు జరగడంలో స్వామి అగ్నివేశ్ కీలక భూమిక పోషించారు.స్వామి అనే పేరు ముందు ఉన్న అతను హిందుత్వ మూఢ భావజాలంకి పూర్తిగా వ్యతిరేకి.
ఈ కారణంగానే అతను హిందుత్వ విధానాలని వ్యతిరేకించి, కొంత మంది మతతత్వ వాదుల నుంచి భౌతిక దాడులు కూడా ఎదుర్కొన్నారు.ఆయన పెరిగింది, విద్యాభ్యాసం చేసింది అంతా ఉత్తర భారతంలో అయిన స్వామి అగ్నివేశ్ అచ్చమైన తెలుగు వ్యక్తి.
శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస సమీపంలో ఒక గ్రామంలో 1939లో ఆయన జన్మించారు.ఈ కారణంగా శ్రీకాకుళంతో అతనికి మంచి అనుబంధం ఉంది.అతని తండ్రి చిన్నతనంలో చనిపోవడంతో నాలుగేళ్ల ప్రాయంలోనే చత్తీస్ ఘడ్ లో తాత దగ్గరకి వెళ్ళిపోయారు.అక్కడే విధ్యాబ్యాసం పూర్తి చేశారు.
తరువాత ఆర్యసమాజ్ సిద్ధాంతాలకి ఆకర్షితులై అందులో చేరారు.తదనంతరం సామాజిక చైతన్య ఉద్యమకారుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
సిక్కోలు ధర్మల్ విధ్యుత్ కి వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు.కాలేయ వ్యాధితో బాధపడుతున్న స్వామి అగ్నివేశ్ కు వైద్యులు నాలుగు రోజుల కిందట వెంటిలేటర్ అమర్చారు.
అయితే ఈ సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో వైద్యుల ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి.అందరినీ విషాదానికి గురిచేస్తూ స్వామి అగ్నివేశ్ తుదిశ్వాస విడిచారు.
స్వామి అగ్నివేశ్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.