కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో లాక్‌డౌన్ విధించారు.దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని రోజు కూలీల అవస్థలు వర్ణనాతీతం.
వీరిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ చివరి వరకు ఆ సాయం రావడం లేదు.ఈ నేపథ్యంలో ఓ ఎన్ఆర్ఐ ఏకంగా రోజుకి 1.25 లక్షల మంది కడుపు నింపుతున్నాడు.హోషియార్‌పూర్ జిల్లాలోని పూర్హిరాన్ గ్రామానికి చెందిన మంజిత్ సింగ్ గత మూడు దశాబ్థాలుగా అమెరికాలో నివసిస్తూ, వ్యాపారం చేస్తున్నాడు.
ఈ క్రమంలో మాతృభూమి రుణం తీర్చుకోవాలని భావించిన మంజిత్ సింగ్ గురు రామ్ దాస్ లాంగర్ అనే కమ్యూనిటి కిచెన్‌ను పూర్హిరాన్ గ్రామంలో నెలకొల్పాడు.ఈ సంస్థలోని వాలంటీర్లు వాహనాల్లో హోషియార్‌పూర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు జలంధర్, గురుదాస్‌పూర్, అమృతసర్, నవాన్‌షహర్ వంటి ఇతర జిల్లాలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.
గత శనివారం నుంచి తమ సేవలను లూధియానా జిల్లాకు కూడా విస్తరించారు.
ఈ కిచెన్‌లోని రెండు యంత్రాలు గంటలకు 10,000 చపాతీలను తయారు చేస్తాయి.
దాదాపు మూడు డజన్ల మంది వంటవారు తెల్లవారుజామున 3 గంటలకే పనులు ప్రారంభిస్తారు.అందువల్లే సమయానికి ఆహారం అందించగలుగుతున్నారు.
ప్రతి టిఫిన్ క్యారియర్‌లో 1,000 చపాతీలను మోసుకెళ్లే సామర్ధ్యం ఉంటుంది.అలాగే పెద్ద టిఫిన్ క్యారియర్లలో ఆహారాన్ని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు గాను మొత్తం 28 బొలెరో వాహనాలను లాంగర్ అధికారులు ఏర్పాటు చేశారు.
మంజిత్ సింగ్ తరపున ఈ లాంగర్ సేవలను బుటా సింగ్ నిర్వహిస్తున్నారు.నిరుపేదలకు సేవ చేయడానికి తాను సహకరిస్తున్నానని.మన జిల్లాలో ఎవరూ ఆకలితో చనిపోకూడదని బుటా సింగ్ అన్నారు.పూరిహిరన్ గ్రామంలో 3.5 ఎకరాల స్థలంలో భారీ కిచెన్, లంగర్ హాల్‌ను నిర్మించారు.ఫిబ్రవరి 19, 2019 నుంచి గురు రామ్ దాస్ లాంగర్ సేవలు ప్రారంభించింది.
తొలుత ఈ చుట్టు పక్కల వున్న ఐవు సివిల్ ఆసుపత్రుల్లో పేద రోగులకు, వారితో పాటు వచ్చే వారికి ఆహారాన్ని అందించేది.

కాగా త్వరలో ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో కిచెన్ ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ప్రతినిధులు స్థలం కోసం వెతుకుతున్నారు.దీని ద్వారా మాల్వా ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సేవలు అందించవచ్చునని లాంగర్ భావిస్తోంది.పేదలకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు గాను ఈ సంస్థ ఏడాదికి రూ.2.93 కోట్లు ఖర్చు చేస్తోంది.ఆహారాన్ని వండటానికి నాణ్యమైన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నామని.ఇందుకోసం రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నామని బుటా సింగ్ చెప్పారు.
ఒప్పందం చేసుకున్న రైతులు ఆహారానికి కావాల్సిన ధాన్యం, పప్పుధాన్యాలు, కూరగాయలను సేంద్రీయ పద్ధతులను ఉపయోగించి పండిస్తారు.అలాగే త్వరలో ఈ సంస్థ పాడి పరిశ్రమను తెరవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని బుటా సింగ్ చెప్పారు.
ప్రస్తుతం కోవిడ్ 19 వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో మరింత మందికి సేవలందించేందుకు గాను లాంగర్ సంస్థకు దాతలు విరాళాలు అందిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సుందర్ షామ్ అరోరా రూ.12 లక్షలు విరాళంగా ఇచ్చారు.