ఏపీ తెలంగాణ విడిపోయిన తరువాత ఏపీ రాజధాని విషయంలో నెలకొన్న సందిగ్ధత ఇప్పటికీ పోలేదు.గత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించి అక్కడ బాగా అభివృద్ధి చేశారు.
పూర్తిస్థాయిలో రాజధాని నిర్మాణ పనులు మొదలవుతాయి అని అంతా అనుకుంటున్న సాయంలో ఇప్పుడు అకస్మాత్తుగా వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయాన్ని గందరగోళంలోకి నెట్టేసింది.అసెంబ్లీ లో మూడు రాజధానులు అని జగన్ ప్రకటించడం ఆ తరువాత జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వడం అందులో ముందుగా జగన్ ఏ నిర్ణయాలయితే ప్రకటించారో అవే అంశాలు ఉండడంతో ఈ వ్యవహారంపై రచ్చ మొదలయ్యింది.
అయితే జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారం మూడు రాజధానులే ఖరారయ్యే అవకాశం కనిపిస్తున్నాయి.అయితే ప్రభుత్వం మాత్రం మరో కీలక నివేదిక కోసం ఎదురుచూస్తోంది.
రాజధాని వ్యవహారంపై జీఎన్ రావు కమిటీ మాత్రమే కాదు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) కూడా అధ్యయనం చేస్తోంది.రాజధానిపై ఓ మధ్యంతర నివేదిక సమర్పించిన బీసీజీ ప్రస్తుతం పూర్తిస్థాయి నివేదికపై కసరత్తులు చేస్తోంది.
ఈ నివేదిక వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.