తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా, లేడీ అమితాబ్ గా పేరుపడ్డ మాజీ ఎంపీ విజయశాంతి చాలా కాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారు.సినిమా షూటింగుల్లో బిజీగా ఉండడం వల్ల ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు.
అయితే అకస్మాత్తుగా ఆమె సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ పరిపాలనపై సంచలనాత్మక విమర్శలు చేశారు.అభివృద్ధి పేరుతో కెసిఆర్ తెలంగాణాలో గారడీ చేస్తున్నారని, కెసిఆర్ కుటుంబం చేసిన దుబారా ఖర్చులు కారణంగా తెలంగాణలో సామాన్యుల నడ్డి వీరిగుతోందని ఆమె ధ్వజమెత్తారు.
సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తే తప్ప ప్రభుత్వాన్ని ముందుకు నడిపించలేని దుస్థితిలో కెసిఆర్ దొరగారు ఉన్నారని ఆమె మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్షాలపై కేసులు పెడుతూ కేసీఆర్ బెదిరిస్తున్నారని, టిఆర్ఎస్ పాలన తెలంగాణ ప్రజలకు శాపం అంటూ విజయశాంతి ధ్వజమెత్తారు.
కెసిఆర్ పరిపాలన తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలు ఎవరూ రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి లేదని, రోడ్డు మీద నడిచినా కెసిఆర్ ప్రభుత్వం డబ్బులు వసూలు చేసేలా ఉందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచారని, నిన్న పాల ధరలు పెంచారని, రేపోమాపో కరెంటు చార్జీలు పెంచేలా ఉన్నారని కెసిఆర్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.