మాటకు ముందు మాట తర్వాత బూతులు మాట్లాడుతూ ఏపీ రాజకీయాలను వేడెక్కించే పనిలో పడ్డారు ఏపీ రాజకీయ నాయకులు.తమ మాటలతో అధికార విపక్ష పార్టీలమీద బూతు పురాణం విప్పుతూ రాజకీయానికి కొత్త అర్ధం చెప్పే పనిలో పడ్డారు.
అధికార పార్టీని ప్రతిపక్షాలు, విపక్ష పార్టీలను అధికార పార్టీ ఇలా ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు.రాజకీయ నాయకులకు కొన్ని విలువలు, సిద్ధాంతాలు ఉంటాయి.
కానీ ప్రస్తుత రాజకీయాల్లో అవేవీ పాటించే విధంగా ఎవరు ముందుకు వెళ్లడం లేదు.నువ్వు ఒకటి అంటే నేను పది అంటా అన్నట్టుగా ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
గతంలో ఈ తరహా రాజకీయం ఏపీలో పెద్దగా కనిపించలేదు.వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతోంది.
మొదటి ఐదు నెలలు సైలెంట్ గానే ఉన్నట్టు ఉన్నా ఒక నెల రోజుల నుంచి మాత్రం ఇష్టానుసారంగా నాయకులు ప్రత్యర్ధుల మీద విరుచుకు పడుతున్నారు.
ఈ విషయంలో ఏపీ మంత్రి కొడాలి నాని ముందు వరుసలో ఉంటున్నారు.

గతంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ విధంగానే వ్యవహరించినా ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.కానీ ఇప్పుడు మాత్రం టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో అసభ్య పదజాలంతో మంత్రి కొడాలి నాని ముందు వరుసలో నిలుస్తున్నారు.ఎక్కడ ఎవరిని ఏవిధంగా విమర్శించాలో విమర్శించకూడదో తెలుయకుండానే ఏదిబడితే అది మాట్లాడేస్తున్నారు.వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉపయోగిస్తున్న పదజాలంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.ఈ విషయంలో జగన్ పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తున్నారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా జగన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా టిడిపి నాయకులపై తమ పార్టీకి చెందిన వారు చేస్తున్న విమర్శలపై జగన్ నోరు మెదపడం లేదు.ప్రస్తుతానికి ఇది ఫర్వాలేదు అన్నట్టుగానే ఉన్నా రానున్న రోజుల్లో మరింతగా నాయకులు రెచ్చిపోతే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తోంది.ఇక ఇప్పుడు ఈ తిట్ల దండకం మొదలుపెడుతున్న వారంతా తాము తిట్టే తిట్ల వల్ల కొత్త తరహా మైలేజ్ వస్తుందని, బాగా పాపులర్ అవ్వడంతో రాజకీయంగా తమను మంచి మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి.