జనసేన పార్టీకి ఏపీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు కి పరిమితం కావడంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అంతంత మాత్రంగానే ఉంటారని, మళ్లీ వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు సైలెంట్ గా ఉండిపోతారని అంతా భావించారు.కానీ పవన్ మాత్రం ఎవరి అంచనాలకు అందకుండా రాజకీయం గా వేగం పెంచారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే పార్టీ నాయకులతో, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు.తప్పు ఎక్కడ జరిగింది, పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోగలిగారు.
ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది ఇకపై పై జరగాల్సింది చూద్దాం అంటూ పార్టీ నాయకులకు భరోసా కల్పించాడు.పార్టీపరంగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా మారిపోయాడు.
రాష్ట్రంలో ప్రజా సమస్య ఏదైనా అందరికంటే ముందుగా దానిపై పవన్ స్పందిస్తూ అధికార పార్టీని నిలదీస్తూ ప్రతిపక్ష పాత్ర సమర్ధవంతంగా పోషిస్తున్నాడు.సమస్య ఎటువంటిదైనా బాధితులు తన దగ్గరకు వచ్చిన రాకపోయినా పవన్ మాత్రం వేగంగా దానిపై స్పందిస్తున్నాడు.

ఇక అధికార పార్టీని విమర్శించే విషయంలో అయితే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశాన్ని మించి పవన్ ఇరుకున పెడుతున్నాడు.ఇసుక పాలసీ, రాజధాని అమరావతి నిర్మాణం, రివర్స్ టెండరింగ్, కరెంటు కోతలు ఇలా అన్ని విషయాల పైన ఘాటు గానే విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.ఇక ఇటీవల పవన్ తెలంగాణలోనూ రాజకీయ కాక పెంచే ప్రయత్నం చేశాడు.నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పవన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతోపాటు అక్కడి గిరిజనులు కు మద్దతుగా తాను పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రకటించారు.
ఇదే స్పీడ్ గత ఐదేళ్ల నుంచి పెంచి ఉంటే జనసేన జనసేన పరిస్థితి మెరుగ్గా ఉండేదని అభిప్రాయం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది.గత ఐదేళ్లుగా చూస్తే పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారన్న ఫీలింగ్ ఆయన సొంత పార్టీలోనే ఉండేది.

ఎంత పెద్ద సమస్య వచ్చిన పవన్ స్పందన అంతంత మాత్రంగానే ఉండేది.ఆ ఎఫెక్ట్ జనసేన మీద పడి ఎన్నికల్లో అవమానకరమైన రీతిలో ఫలితాలు వచ్చాయి.ప్రస్తుతం ఆ లోపాలను సరి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో జనసేనకు మంచి రాజకీయ భవిష్యత్ కల్పించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.పవన్ పెంచిన ఈ స్పీడ్ ఈ ఐదేళ్లపాటు కొనసాగిస్తే ఆ పార్టీకి మంచి ఫలితాలే వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అలాగే క్షేత్ర స్థాయిలో కూడా బలం పెంచుకుని ముందుకు వెళ్తే పవన్ కు తిరుగే ఉండదు అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.