పాతోళ్లను పాతరేస్తున్నారు.కొత్తోళ్లకు జాతర చేస్తున్నారు.
ఇదెక్కడి న్యాయం? ఏమిటీ అన్యాయం? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీఆర్‌ఎస్ నాయకులు.పార్టీ పుట్టినప్పటి నుంచి దాన్ని నమ్ముకొని ఉన్నవాళ్లను పక్కనబెట్టి నిన్న మొన్న పార్టీలోకి వచ్చినవారిని అందలం ఎక్కిస్తున్నారని మండిపడుతున్నారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనే మొదలైన లుకలుకలు సంస్థాగత ఎన్నికల సమయం నాటికి తీవ్రంగా ప్రబలిపోయాయి.రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఈ సమస్య ఎక్కువగా ఉంది.
ఈ మూడు జిల్లాల నుంచి ఎక్కువమంది ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.వలసవాదుల (ఇతర పార్టీల్లోంచి వచ్చినవారు) ఆధిపత్యం చూసి పాతవాళ్లకు దిమ్మతిరుగుతోందని ఓ సీనియర్ టీఆర్‌ఎస్ నాయకుడు వాఖ్యానించారట…! కొత్తవారు కీలక పదవులు కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది తమకు ఇబ్బందిగా ఉందని ఆయన వాపోయారట…! ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేశారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి నేతృత్వంలో పన్నెండు మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు.పార్టీ ప్లీనరీ జరగడానికి ముందే అంటే ఏప్రిల్ ఇరవైనాలుగో తేదీకల్లా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సివుంది.
వలసవాదులు టీఆర్‌ఎస్‌లోని సీనియర్ నాయకులపై ఆధిపత్యం జరుపుతుండటాన్ని ఓ సీనియర్ నాయకుడు విశ్లేషిస్తూ ‘ఇదంతా ప్రతి పార్టీలో ఉండే వ్యవహారమే’ అన్నారు.ఎప్పుడూ రెండు గ్రూపులు ఘర్షణ పడతాయి.
కాని బాస్ చేసిన నిర్ణయమే ఫైనల్ అని కూడా ఆ నాయకుడు సెలవిచ్చాడు.ఏ పార్టీలోనూ ప్రజాస్వామ్యం ఉండదు.
నాయకులంతా కొట్టుకుంటారు.పదవుల కోసం వెంపర్లాడతారు.
వీరి వ్యవహారం చూసి అధినేతే ఏదో ఒకటి నిర్ణయిస్తాడు.ఆయన సమీకరణాలు ఆయనకు ఉంటాయి కదా…! పదవులు ఇవ్వాలంటే రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగాని సీనియారిటీ కాదు కదా….!
.