రోజులు దగ్గరపడుతున్నాయంటే అపార్థం చేసుకోవద్దు.మరోలా అన్వయించుకోవద్దు.
రోజులు దగ్గరపడుతున్నాయంటే వారి పదవులు ఊడే సమయం దగ్గరపడుతోందని అర్థం.పదవులు ఊడే ప్రమాదం ఎవరికి ఉంది? తెలంగాణ రాష్ర్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి.మొదటి నాయకుడు ఖమ్మం జల్లాకు చెందినవాడు.టీడీపీ నుంచి గులాబీ పార్టీలోకి వచ్చాడు.రెండో నాయకుడిది వరంగల్ జిల్లా.టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చి వరంగల్ నుంచి ఎంపీ అయ్యాడు.
ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ బలహీనంగా ఉంది.దీన్ని బలోపేతం చేయాలనుకున్న కేసీఆర్ మాజీ మంత్రి తుమ్మలపైన గురి పెట్టి, టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చాడు.
అవినీతి ఆరోపణలపై దళిత నాయకుడు డాక్టర్ రాజయ్యను పదవి నుంచి తొలగించాక కడియంను ఉప ముఖ్యమంత్రిగా నియమించి విద్యా శాఖ ఇచ్చారు.మంత్రులు కాగానే సంబరం కాదు కదా…! ఏ సభలోనూ సభ్యుడు కాని తుమ్మల, ఎంపీగా రాజీనామా చేసిన కడియం ఏదో ఒక సభలో సభ్యులు కావాలి.
ఎమ్మెల్యేలుగా అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావాలి.ఆ ఎన్నికల విషయంలోనే జాప్యం జరుగుతుండటంతో మంత్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రోజులు గడుస్తున్న కొద్దీ బెంగపడుతున్నారు.పదవి చేపట్టిన ఆరు నెలలలోగా ఏదో ఒక సభకు ఎన్నిక కావాలనే నిబంధన ఉంది కదా…! జూన్ పదహారో తేదీనాటికి తుమ్మల, జూలై ఇరవైఐదో తేదీ నాటికి కడియం ఎన్నిక కాకపోతే పదవులు కోల్పోవాల్సివుంటుంది.
విభజన సమస్యల కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడుతున్నాయి.







