కలెక్టర్ అంటే ఎలా ఉండాలి…టిప్ టాప్ గా రెడీ అయి.ఇంగ్లీషు మాట్లాడుతూ.
సామాన్య జనాన్ని పట్టించుకోకుండా కేవలం అధికారులు,రాజకీయనాయకులు చెప్తున్న పనులకు తలాడిస్తూ.వాళ్లు చెప్పిన పనులను మాత్రమే చేసేవాడే కలెక్టర్…అలాంటి కలెక్టర్ తో మాట్లాడానికి మామూలు జనం వణికి పోవాలి.
కానీ ఈ కలెక్టర్ ఏంటండి బాబూ… మనుషుల సమస్యలను పట్టించుకోవడమే కాదు.తానే స్వయంగా దగ్గరుండి పరిష్కరిస్తుంటాడు.
తనకొచ్చే ప్రతి ఉత్తరాన్ని తనే స్వయంగా చదివి వాటికి పరిష్కారాలను తనే చూపిస్తుంటాడు తమిళనాడులోని తిరుమన్నామలై జిల్లా కలెక్టర్ కందస్వామి.కలెక్టర్ మంచితనం గురించి ,తను ఆ జిల్లాలో సామాన్య ప్రజలకు చేస్తున్న మంచి పనుల గురించి తెలుసుకున్న ఒక చిన్నారి తన కష్టాన్ని ఒక ఉత్తరంలో రాసి పోస్టు చేసింది.దాన్ని చదివిన కందసామి ఆ అమ్మాయిని,తన తల్లిని కలెక్టరేట్ కి పిలిపించాడు.ఇంతకీ ఆ ఉత్తరం సారాంశం ఏంటంటే.సార్ మమ్మల్ని ఆదుకోండి.మా అమ్మ కూలి పని చేస్తుంది,నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు.
నేను,నా తోబుట్టువులు కష్టాల్లో ఉన్నాం.మా నాన్న యాక్సిడెంట్ కి రావాల్సిన నష్టపరిహారం కూడా ఇంకా మాకు రాలేదు.
ప్లీజ్ మాకు సాయం చేయండి”అని…అది రాసిన అమ్మాయి పేరు ఎల్.కార్తీక.తండ్రి లోగనాధన్…
కార్తిక ఉత్తరానికి స్పందించిన కలెక్టర్ వెంటనే అధికారులను ఆదేశించి తండ్రి యాక్సిడెంట్ తాలుకు పరిహారం అందేలా చూడడమే కాదు.తల్లికి రావల్సిన పించన్ అందేలా చేశాడు.గృహనిర్మాణపథకం కింద ఇంటిని మంజూరు చేశాడు.కేవలం కార్తీక కథ మాత్రమే కాదు.కలెక్టర్ కావాలనుకుంటున్న అని ఒక అమ్మాయి ఉత్తరం రాస్తే తనని కలెక్టరేట్ కి పిలిపించి కారులో కలెక్టరేట్ అంతా తిప్పి,అక్కడ విధివిధానాలు తెలియచేసి,తనకి భోజనం పెట్టి పంపేటప్పుడు ఎప్పటికైనా నువ్ కలెక్టర్ అయి ఇక్కడ అడుగుపెడతావ్ అని స్పూర్తిని నింపాడు.వీరిద్దరిలాగే ఎన్నో కథలు .ఎందరినో కదిలించాడు కలెక్టర్ కందసామి.
ప్రసవసమయంలో అనారోగ్యంతో మరణించిన ఒకతల్లి ,ముగ్గురు బిడ్డలకు పెద్ద దిక్కు కావల్సిన తండ్రి మూత్రపిండాల వ్యాధితో మరణం.తల్లిదండ్రుల మరణంతో ఆ బిడ్డలను సాకిన నాన్నమ్మ .ఇలా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురూ మరణించగా.ఆ బిడ్డలకు తనే పెద్దదిక్కయ్యాడు.తల్లి చేసే మధ్యాహ్న భోజన పథకం ఉద్యోగం పెద్ద కూతురుకి వచ్చేలా చేశాడు,పిల్లల చదువులకు దాతలను వెతికి పెట్టాడు.ఇంత చేసినాయన ఒక రోజు భోజనానికి వస్తున్నా అని కబురు పెడితే ఏం చేయాలో పాలుపోని ఆ పిల్లలకు తనే దగ్గరుండి వంటచేసి, వారితో కలిసి భోజనం చేశాడు…ఇది కలెక్టర్ కందసామి కథ.ఈ రోజుల్లోఇలాంటి కలెక్టర్లున్నారా అంటే సమాధానం ఒకటే కందసామి ఉన్నాడుగా…సారీ కందసామి సార్ ఉన్నారుగా…
.