ఇటీవలి కాలంలో హత్యలు, దోపిడీలు, బడా కుంభకోణాలకు పాల్పడిన కొందరు మనదేశాన్ని విడిచి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ తదితర ఆర్ధిక నేరగాళ్లు.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు కుచ్చుటోపి విదేశాలకు ఎగిరిపోతున్న సంగతి తెలిసిందే.అలాగే పలువురు నర హంతకులు, గ్యాంగ్‌స్టర్లు కూడా ఫారిన్‌లో తలదాచుకుంటున్నారు.
వీరిని భారత్‌కు రప్పించేందుకు మన దర్యాప్తు సంస్థలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.ఆయా దేశాల్లో వుంటూనే భారత్‌లో తమ నేర కార్యకలాపాలు సాగిస్తున్నారు కొందరు గ్యాంగ్‌స్టర్లు.
తాజాగా కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాపై పంజాబ్‌లో కేసు నమోదైంది.రూ.50 లక్షల కోసం స్థానికుడిని బెదిరించిన కేసులో అతనిపై తరన్ తారన్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.స్థానిక మాస్టర్ కాలనీకి చెందిన గుర్డియాల్ సింగ్ సిద్ధూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.
గతేడాది సెప్టెంబర్ 27 నుంచి ఈ ఏడాది మార్చి 7 వరకు లాండా పలు ఫోన్ నెంబర్లను ఉపయోగించి వాట్సాప్, వాయిస్ మెసేజ్‌ల ద్వారా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు.తాను కోరిన మొత్తం చెల్లించకుంటే నీ కుటుంబం మొత్తాన్ని హతమారుస్తానంటూ లాండా హెచ్చరించాడని గుర్డియాల్ ఫిర్యాదులో తెలిపాడు.
కెనడాలో వున్న గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాపై హత్య, హత్యాయత్నం, కాల్పులు వంటి దాదాపు 20 క్రిమినల్ కేసులు వున్నాయి.తరన్ తారన్ జిల్లాలోని హరికేకి చెందిన లాండాపై ఈ స్థాయిలో కేసులు వున్నా.అతను రెండేళ్ల క్రితం విదేశాలకు పారిపోయాడు.ఈ నేపథ్యంలో అతని అప్పగింత సహా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు.గతేడాది మే 27న పట్టి వద్ద ఇద్దరు అకాలీదళ్ కార్యకర్తలను కాల్చిచంపిన కేసులోనూ అతను ప్రధాన సూత్రధారి.లాండా సహా విదేశాలకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్లు తమకు తలనొప్పిగా మారారని పోలీసులు అంటున్నారు.
సోషల్ మీడియాతో పాటు ఇక్కడ వున్న పరిచయాలు, పలువురి అండదండల కారణంగా వారిని అదుపులోకి తీసుకోవడం సాధ్యం కావడం లేదని చెబుతున్నారు.