ప్రముఖ సినీ నటులు, ఆంద్ర ప్రదేశ్ లోని హిందుపురం నియోజక వర్గ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ 62 వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
BIACH&RI ఆవరణలో నిర్వహించిన ఈ నేడుకలలో పాల్గొన్న శ్రీ నందమూరి బాలకృష్ణ ముందుగా తన తల్లితండ్రులైన దివంగత స్వర్గీయ శ్రీమతి బసవతారకం మరియు శ్రీ నందమూరి తారక రామారావు గార్ల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఆరోగ్య శ్రీ పేషెంట్లకు మెరుగైన, వేగవంతమైన, సులభతరమైన రీతిలో ఆరోగ్య శ్రీ రిజిస్ట్రేషన్ మరియు ఇతరత్రా సేవలు అందించడానికి వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన సరికొత్త ఆరోగ్య శ్రీ ఓ పి డి బ్లాక్ ను ప్రారంభించారు.
అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఆడిటోరియంలో BIACH&RI సిబ్బంది, యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక పుట్టిన రోజు వేడుకల సంబరంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిబ్బంది ఏర్పాటు చేసిన 62 కిలోల కేకును కట్ చేసి తనతో పాటూ కేక్ కటింగ్ సంబరాలలో పాల్గొన్న క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులకు తినిపించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి శ్రీ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తల్లితండ్రులకు బిడ్డగా వారు సాధించిన పేరును జాతీయ స్థాయిలో నెలబెట్టుకోనేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.
వారి స్పూర్తితో ఈ జీవితంలో సినీ నటునిగా, ప్రజా ప్రతినిథిగా ఎన్నో రకాల పాత్రలను న్యాయబద్దంగా పోషించడానికి అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతానని అన్నారు.
తన తల్లి జ్ఞాపకార్థం శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ క్యాన్సర్ హాస్పిటల్ నేడు ఎందరో పేద క్యాన్సర్ రోగులకు వెలుగులిస్తోందని అయితే స్థలాభావం కారణంగా పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా సేవలు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఇప్పటికే స్థానిక తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని అంటూ హైదరాబాదు పరిసరాలలో అనువైన స్థలాన్ని అందజేస్తే హాస్పిటల్ సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు.
ఈ సందర్భంగా సంస్థ అభివృద్దిలో ఎప్పటికపుడు కీలక పాత్ర పోషిస్తున్న దాతలను శ్రీ బాలకృష్ణ ప్రశంసిస్తూ వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా శ్రీమతి గుత్తా భానుమతి గాంధి గారు యాభై లక్షల రూపాయల విలువైన స్థలాన్ని – శ్రీ బంగారు రాజు మరియు శ్రీ పరుచూరు ఈశ్వర్ గారు తాము స్థాపించిన యువర్ హెల్ప్ కౌంట్స్ ఫౌండేషన్ ద్వారా 12 వేల యూయస్ డాలర్ల విరాళాన్ని – శ్రీమతి రేవతి, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హైదరాబాదు వారు తన తల్లితండ్రులైన శ్రీమతి మరియు శ్రీ రుక్మిణి వెంకటాచారి ల స్మృత్యర్థ్యం పది లక్షల రూపాయలు – శ్రీ సీతారామ రాజు గారు లక్ష రూపాయల విరాళాన్ని శ్రీ నందమూరి బాలకృష్ణకు అందజేశారు.వీరిని శ్రీ బాలకృష్ణ ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు.
సంస్థ సేవలను విస్తృతపరచడానికి దాతలు అందిస్తున్న సహాయసహకారలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమాలలో శ్రీ నందమూరి బాలకృష్ణతో పాటూ శ్రీమతి నారా బ్రాహ్మణి, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; శ్రీ యం శ్రీ భరత్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; డా.ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా.కల్పనా రఘునాథ్, ఆసోసియేట్ డైరెక్టర్ – యాడ్ లైఫ్ మరియు అకడమక్స్, BIACH&RI; డా.కె ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI లతో పాటూ వైద్యులు, పారా మెడికల్, నర్సింగ్, వైద్యేతర సిబ్బంది, రోగులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.