అంతరిక్షంలో భారత సంతతికి చెందిన వ్యోమగామి రాజాచారి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.దాదాపు ఆరు నెలలు పాటు స్పేస్‌లో గడిపిన ఆయన తిరిగి క్షేమంగా భూమికి చేరారు.
నలుగురు వ్యోమగాములతో కూడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ కాప్సూల్ శుక్రవారం ‘‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’’ తీరంలో ల్యాండైంది.ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి భూమికి పయనమైన 24 గంటల్లోపే ఈ డ్రాగన్ కాప్సూల్ గమ్యస్థానానికి చేరింది.
వీరిలో రాజాచారి కూడా వున్నారు.
రాజాచారి నాసా తరఫున ఈ యాత్రలో కమాండర్ హోదాలో పాల్గొన్నారు.
ఆయనతో పాటు నాసా పైలెట్ థామస్ మార్ష్ బర్న్, మిషన్ స్పెషలిస్ట్ కైలా బారన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మథియాస్ మౌరర్ కూడా భూమికి క్షేమంగా తిరిగి వచ్చారు.దీనికి సంబంధించిన ఫోటోలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ( నాసా) విడుదల చేసింది.
రాజాచారి బృందం 2021 నవంబర్‌లో ఐఎస్ఎస్‌కు వెళ్లింది.దాదాపు 175 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది.
వీరందరినీ హెలికాఫ్టర్‌లో ఫ్లోరిడా తరలించారు అధికారులు.
స్పేస్ స్టేషన్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఈ ప్రయోగం చేపట్టింది.
ఐఎస్ఎస్‌కు ప్రస్తుతం 160 కిలో వాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండగా కొత్త ప్యానళ్ల అమరిక తర్వాత ఇది 215 కిలోవాట్లకు పెరగనుంది.ఈ పర్యటనలో భాగంగా రాజాచారి స్పేస్ వాక్ కూడా చేశారు.
ఎవరీ రాజాచారి:
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాజా చారి శిక్షణ పొందారు.యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లో శిక్షణ పొందిన ఏకైక భారత సంతతి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం.
ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాసుల కోసం నాసా అతన్ని 2017లో ఎంపిక చేసింది.కఠిన శిక్షణను పూర్తి చేసుకున్న రాజాచారి మూన్ మిషన్‌కు కూడా అర్హత సాధించినట్లు గతంలోనే నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే.
నాసా 2024లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్’కు ఎంపికైన వ్యోమగాముల్లో ఆయన కూడా ఒకరు.
మిల్వాకీలో జన్మించిన రాజాచారి తండ్రి భారతీయుడు కాగా, తల్లి అమెరికన్.ఆయన బాల్యం తల్లి స్వగ్రామం అయోవాలోని సెడార్ ఫాల్స్‌లోనే గడిచింది.యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో కల్నల్ స్థాయికి చేరిన రాజా చారికి టెస్ట్ పైలట్‌గా విశేషమైన అనుభవం వుంది.
ఎఫ్ 35, ఎఫ్ 15, ఎఫ్ 16, ఎఫ్ 18లో 2,500 గంటల పాటు విమానయానం చేసిన అనుభవం ఆయన సొంతం.ఇరాక్ యుద్ధంతో పాటు కొరియా ద్వీపకల్పంలోనూ రాజాచారి అమెరికా వాయుసేన తరపున సేవలందించారు.
మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు.అనంతరం మేరీల్యాండ్‌లోని పటుక్సెంట్ నదిలో యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్, కాన్సాస్‌లోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలోనూ శిక్షణ పూర్తి చేసుకున్నారు.