ఏపీ ప్రభుత్వం విషయంలో బిజెపి ఆలోచన ఎవరికి అర్థం కావడం లేదు.కేంద్రంలో జగన్ కు మద్దతుగా బిజెపి పెద్దలు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ, జగన్ నిర్ణయాలను, ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చుకుంటూ ఉండగా , ఏపీ బీజేపీ నాయకులు మాత్రం అవే పథకాలపై విమర్శలు చేస్తూ, ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉండడంతో బిజెపి వ్యవహారంపై అందరికీ గందరగోళంగానే ఉంది.
ఇక విషయానికొస్తే బిజెపి ఏపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు.ఈ లేఖలో దేవాలయాలకు భక్తులు ఇస్తున్న కానుకలపై తక్షణమే క్లారిటీ ఇవ్వాలని వీర్రాజు డిమాండ్ చేస్తూ లేఖ రాశారు.
భక్తులు దేవాలయాలకు ఇచ్చిన కానుకలు , మొక్కుబడుల సొమ్ములను దేవాలయ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలిన సొమ్ములను బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా, భవిష్యత్తు అవసరాల కోసం వినియోగిస్తారని, ఆ సొమ్ములను విత్ డ్రా చేయించడం, వాటిని సర్వ శ్రేయ నిధికి జమ చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ ద్వారా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారా లేదా అన్న విషయంపై హిందూ సమాజానికి జగన్ క్లారిటీ ఇవ్వాలని వీర్రాజు డిమాండ్ చేశారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, హైందవ దేవాలయాలన్నీ దర్శనీయ క్షేత్రాలేనని ప్రభుత్వం పొరపాటు పడుతున్నట్లు అర్థం అవుతుందని వీర్రాజు లేఖలో ప్రస్తావించారు.
భక్తులు రూపాయి , పది రూపాయల నుంచి దక్షిణ కానుకలుగా ఇచ్చిన సొమ్ములో కొంత ఆదా చేసి సంవత్సరాల తరబడి దాచిన పొదుపు మొత్తాలను చిన్నచిన్న ఆలయాలు ఎఫ్ డీ ఐ లలో భద్రపరుచుకుంటే, ఆ మొత్తాలను కూడా ప్రభుత్వం దోచుకోవడానికి సిద్ధమవడం సిగ్గు చేటని వీర్రాజు లేఖలో మండిపడ్డారు.ముల్లాలకు , పాస్టర్లకు గౌరవ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు.

భక్తుల కానుకల ద్వారా మాత్రమే హిందూ దేవాలయాల నుంచి వచ్చే సొమ్ములను మాత్రం దేవదాయ శాఖ పెత్తనం ద్వారా ఆలయాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన నిధులను కొల్లగొడుతున్నారని, ఔరంగజేబు నిజాం నవాబు సైతం చేయని విధంగా ఆలయాల సొమ్ములను దోచుకోవడం నీతి బాహ్య చర్యగా భావిస్తున్నానంటూ వీర్రాజు విమర్శించారు.ఇప్పటికే దేవుడు మాన్యాలను రకరకాల పేర్లతో కబ్జా చేస్తున్నారని, ఇప్పుడు ఆలయాల ద్వీప ధూప నైవేద్యాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ గా దాచుకున్న చిన్న మొత్తాలను కూడా కామన్ గుడ్ ఫండ్ లో జమ చేయించడం ధర్మం కాదని గ్రహించాలని వీర్రాజు లేఖలో కోరారు.