ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో వున్న అధికారాన్ని లాక్కోవాలని ఆప్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
దీనికి తోడు కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని మాజీ సీఎం అమరీందర్ సింగ్ సారథ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూడా పావులు కదుపుతోంది.అటు గట్టి అభ్యర్ధులను నిలబెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తనదైన వ్యూహాలతో దూసుకెళ్తోంది.దీనిలో భాగంగా ఎన్ఆర్ఐలను హస్తం పార్టీ టార్గెట్ చేసింది.
ఇప్పటికే పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ పలుమార్లు పంజాబీ ప్రవాసులతో భేటీ అయ్యారు.
తాజాగా నిన్న ఇండియన్ ఓవర్సీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు మద్ధతిచ్చిన ఎన్ఆర్ఐలతో సిద్ధూ సమావేశమయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ … ప్రవాసులను ‘‘పంజాబ్ ఆత్మ’’గా అభివర్ణించారు.రాష్ట్రంలోని ఎన్నో గ్రామాల్లో ప్రభుత్వం కంటే ఎక్కువ మొత్తంలో నిధులను ప్రవాసులు ఇచ్చారని, వారి ప్రభావాన్ని విస్మరించలేమని సిద్ధూ పేర్కొన్నారు.
అలాగే ఎన్నికల ప్రచారం కోసం నిధులు వెచ్చించే బదులు.పంజాబ్‌లో నివసిస్తున్న బంధువుల్లో కనీసం 100 మందిని కలిసి , వారితో సత్యానికే ఓటు వేయమని చెప్పాల్సిందిగా నవజోత్ సింగ్ సిద్ధూ విజ్ఞప్తి చేశారు.
పంజాబ్‌ను ప్రగతిపథంలో నడిపించడంలో భాగస్వాములుగా వున్న ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేకంగా ‘పంజాబ్ మోడల్’’ రోడ్ మ్యాప్ మన రాష్ట్రానికి వుందని ఆయన గుర్తుచేశారు.పంజాబ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఎంతోమంది ప్రవాసులు భావిస్తున్నారు.
అయితే నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడం వల్ల వారు నిరాశకు లోనవుతున్నారని సిద్ధూ అభిప్రాయపడ్డారు.అధికారిక, వివాదాలు లేని సింగ్ విండో వ్యవస్థ వున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు పంజాబ్ కోసం ముందుకు వస్తారని నవజోత్ సింగ్ సిద్ధూ చెప్పారు.
రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వ్యవస్థలపైనా, మాఫియాపైనా తాను పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.