పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా దారుణ హత్యతో యావత్ దేశం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.మిత్రులతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్న సిద్ధూని.
సినీ ఫక్కీలో వెంటాడి హతమార్చారు దుండగులు.రష్యాలో తయారైన రైఫిల్‌ను ఈ హత్య కోసం వాడటంతో పంజాబ్ పోలీసులు ఖంగుతిన్నారు.
సిద్ధూ హత్య తమ పనేనంటూ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అంగీకరించాడు.కెనడాలో వున్న తన సన్నిహితుడు గోల్డీ బ్రార్ ద్వారా సిద్ధూ హత్యకు పథకాన్ని రచించి అమలు చేసినట్లు తెలిపాడు.
దీంతో కెనడా గ్యాంగ్‌స్టర్‌ల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కెనడాలో వుంటూ పంజాబ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్‌స్టర్‌లను పట్టుకునేందుకు తమకు సహకరించాలంటూ కెనడా ప్రభుత్వాన్ని కోరారు సీఎం భగవంత్ మాన్.
కెనడా హైకమీషనర్ కెమెరూన్ మాకేను శుక్రవారం తన నివాసంలో కలిశారు ముఖ్యమంత్రి.ఇరు దేశాల్లోనూ గ్యాంగ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని భగవంత్ మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.ఎన్నో ఏళ్లు కష్టపడి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పామని.కానీ కెనడా గడ్డ నుంచి పనిచేస్తున్న గ్యాంగ్‌స్టర్లు దీనికి విఘాతం కలిగిస్తున్నారని సీఎం తెలిపారు.
ఈ గూండాలు శాంతి భద్రతల సమస్య సృష్టిస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రగతిని నిర్వీర్యం చేస్తున్నారని భగవంత్ మాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యాంగ్‌స్టర్‌లను కఠినంగా శిక్షించాలని … ఈ విషయంలో కెనడా- పంజాబ్ మధ్య జాయింట్ పోలీస్ ఆపరేషన్ తదితర అంశాలపై సీఎం చర్చించారు.విపత్కర పరిస్ధితుల్లోనూ శాంతి భద్రతలను కాపాడే సత్తా పంజాబ్ పోలీసులకు వుందని, కెనడా వంటి అధునాతన పోలీసు బలగాలు పంజాబ్‌కు సహకరిస్తే ఈ ముఠాలను సులువుగా నిర్మూలించవచ్చని హైకమీషనర్‌ను సీఎం కోరారు.