రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాతో సంగీత దర్శకుడిగా పాపులారిటీని సంపాదించుకున్నారు థమన్.టాలీవుడ్ లో ఏ మ్యూజిక్ డైరెక్టర్ లేనంత బిజీగా థమన్ ఉన్నారు.
ఈ ఏడాది విడుదల కాబోతున్న చాలా సినిమాలకు థమన్ సంగీతం అందించనున్నారు.పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా ఈ సినిమా నుంచి నిన్న సత్యమేవజయతే సాంగ్ విడుదలైంది.
అయితే ఈ పాట ట్యూన్ కాపీ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో థమన్ ను ట్రోల్ చేస్తున్నారు.
అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన జేమ్స్ బాండ్ మూవీ 2015 సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందించగా సినిమాలోని బుల్లెట్ అనే పాట ట్యూన్ సత్యమేవ జయతే సాంగ్ ను పోలి ఉండటం గమనార్హం.
సత్యమేవ జయతే పాట కాపీ ట్యూన్ అంటూ వస్తున్న వార్తలు వకీల్ సాబ్ చిత్రయూనిట్ కు, పవన్ ఫ్యాన్స్ కు తలనొప్పిగా మారాయి.
అయితే థమన్ గతంలో తనపై వ్యక్తమైన కాపీ క్యాట్ ఆరోపణల గురించి స్పందిస్తూ తాను ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల ట్యూన్ లను కాపీ చేయనని అలా కాపీ చేసి ఉంటే కేసు పెట్టేవాళ్లు కదా.? అని ప్రశ్నించారు.వకీల్ సాబ్ కాపీ ట్యూన్ ఆరోపణల గురించి థమన్ స్పందించి వివరణ ఇస్తారేమో చూడాల్సి ఉంది.
మరోవైపు ఈ పాటకు ఇప్పటివరకు 25 లక్షల వ్యూస్ వచ్చాయి.ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
గతేడాది మే 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేశారు.
దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కోసం పవన్ 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.