బ్రిటన్ మహారాణి ఎలిజబెత్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన 19 ఏళ్ల భారత సంతతి సిక్కు యువకుడిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు.అంతకుముందు 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండకు ప్రతీకారంగానే తాను క్వీన్ ఎలిజబెత్‌ను హత్య చేయాలనుకున్నట్లు ఆ బాలుడు చెప్పాడు.
తన పేరు జస్వంత్ సింగ్ ఛాయిల్ అని, తాను భారతీయ సిక్కునని వివరిస్తూ స్నాప్‌చాట్‌లో వీడియో పోస్ట్ చేశాడు.జాతి పేరుతో వివక్షకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు, అవమానాలకు గురైనవారి తరఫున ప్రతీకారం తీర్చుకుంటానని జస్వంత్ అన్నాడు.
ఈ సమయంలో యువకుడు ముసుగు ధరించి.చేతిలో విల్లువంటి క్రాస్బౌ ఆయుధాన్ని పట్టుకున్నాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దినిమిషాల తర్వాత క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు విండ్సర్ క్యాజిల్ రాజప్రాసాదానికి క్వీన్ ఎలిజబెత్ వెళ్లారు.
శనివారం జస్వంత్ అక్కడికి వెళ్లాడు.చేతిలో క్రాస్బౌ ఉంది.
అయితే రాణి నివాసం వరకు వెళ్లేలోపే భద్రతా సిబ్బంది అతనిని పట్టుకున్నారు.అలాగే సౌతాంప్టన్ ప్రాంతంలో అతని ఇంటికి వెళ్లి సోదాలు జరిపి మరో క్రాస్బౌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే జస్వంత్ మానసిక పరిస్ధితిపై అనుమానాలు రావడంతో అతనిని పోలీసులు మానసిక వైద్యుల పర్యవేక్షణలో వుంచారు.
కాగా.
భారత స్వాతంత్ర పోరాట చరిత్రలోనే అత్యంత హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది.నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు.జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్ పట్టణంలోని ఓ తోట.వైశాఖీ పర్వదినం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్‌కు చేరుకున్నారు.అయితే, ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్ర సమరయోధులు సైతం ఇందులో పాల్గొన్నారు.
ఈ విషయం తెలుసుకున్న జనరల్ రెజినాల్డ్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం జలియన్ వాలాబాగ్‌లోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.50 మంది సైనికులు పది నిమిషాలు పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిపారు.తప్పించుకోవడానికి వీలు లేకుండా ప్రవేశ మార్గాలను మూసివేసి.జనంపై తూటాల వర్షం కురిపించారు.ఈ ఘటనలో 379 మంది మరణించారని బ్రిటీష్ ప్రభుత్వం చెప్పినప్పటికీ.1000కి పైగా మరణించగా, 2000 మందికి పైగా గాయపడ్డారని జనం ఇప్పటికీ చెప్పుకుంటారు.ఇంతటి మారణహోమానికి కారణమైన జనరల్ డయ్యర్‌పై పగబట్టిన సర్దార్ ఉదమ్ సింగ్.ఆయనను కొన్నేళ్లపాటు వెంటాడి లండన్‌లో కాల్చిచంపారు.