అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )వచ్చే ఏడాది జనవరి 20న తాను బాధ్యతలు స్వీకరించే నాటికి కేబినెట్‌ను సిద్ధం చేసుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు.ఇప్పటికే పలువురిని ఉన్నత హోదాల్లో నియమించారు.
వీరిలో భారత సంతతి నేతలు కూడా ఉన్నారు.తాజాగా ఈ లిస్ట్‌లో మరో భారతీయ అమెరికన్ చేరాడు.
కీలకమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా జై భట్టాచార్యను నామినేట్ చేశారు.ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
1968లో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు జై భట్టాచార్య( Jai Bhattacharya ).1997లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ( Stanford University School of Medicine )డాక్టరేట్ పొందిన ఆయన ఇదే సంస్థ నుంచి ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.అనంతరం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ హెల్త్ పాలసీ ప్రొఫెసర్‌గా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్‌లో అసోసియేట్‌గా పనిచేశారు.తనను ఎన్ఐహెచ్‌కు( NIH ) డైరెక్టర్‌గా నియమించడం పట్ల జై భట్టాచార్య హర్షం వ్యక్తం చేశారు.
ఎన్ఐహెచ్ డైరెక్టర్ హోదాలో 47.3 బిలియన్ల బడ్జెట్‌ను పర్యవేక్షించడంతో పాటు సంస్థకు ఆయన నాయకత్వం వహిస్తారు.ఎన్‌ఐహెచ్‌ని పర్యవేక్షించే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్‌కి నాయకత్వం వహించడానికి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను ట్రంప్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.ఎన్ఐహెచ్ డైరెక్టర్ దేశంలోని 27 ఇన్‌స్టిట్యూట్‌లు, సెంటర్‌ల ప్రారంభ పరిశోధనలపై దృష్టి సారించాల్సి ఉంటుంది.
ఇందులో మహమ్మారుల వ్యాక్సిన్స్‌తో పాటు కొత్త ఔషధాల తయారీ వంటి లక్ష్యాలు కూడా ఉంటాయి.
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు అక్టోబర్ 2020లో జై భట్టాచార్యతో పాటు మరో ఇద్దరు విద్యావేత్తలు గ్రేట్ బారింగ్‌టన్ డిక్లరేషన్‌ను ప్రచురించడం కలకలం రేపింది.దీని ప్రకారం.వైరస్ బారినపడని వారు సాధారణ జీవితాన్ని కొనసాగించాలని వారు పిలుపునివ్వడం వివాదాస్పదమైంది.