దేశంలో ఉద్యోగాలు చేసేవాళ్లలో ఎక్కువమంది కూర్చుని పని చేసే ఉద్యోగాలనే చేస్తున్నారు.కొంతమంది ఉద్యోగం చేసే సమయంలో అటూఇటూ తిరిగినా ఎక్కువ మంది మాత్రం అదే పనిగా 2 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చుంటున్నారు.
ఎక్కువ సమయం కూర్చుని పని చేయడం వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది.కదలకుండా కూర్చుని ఎక్కువ సమయం పని చేసేవాళ్లు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కంప్యూటర్, ల్యాప్ టాప్ ల ముందు పని చేసేవారిలో చాలామంది ఎక్కువ పని ఉండటం వల్ల గంటల సమయం కదలకుండా అదేపనిగా కూర్చుంటారు.కూర్చుని పని చేసేవాళ్లలో వ్యాయామం చేసేవారితో పోలిస్తే వ్యాయామం చేయని వారికి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
మిన్నెసోటా, రోచెస్టార్ కు చెందిన శాస్త్రవేత్తలు 2,000 కంటే ఎక్కువ మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.
లంచ్ చేసిన తరువాత కూర్చోకుండా కొంత సమయం పాటు అటూఇటూ తిరిగితే మంచిదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది.పని ఎక్కువగా ఉన్నా నడకను అలవాటుగా మార్చుకుంటే మంచిది.
కదలకుండా కూర్చోవడం వల్ల ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు మనల్ని వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రోజుకు ఎనిమిది గంటలు అంతకంటే ఎక్కువ సమయం కూర్చుని పని చేసేవారి లైఫ్ టైమ్ కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడం, జీవక్రియల వేగం తగ్గడం, నడుము సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది.60 నిమిషాలకు ఒకసారి కనీసం 5 నిమిషాల పాటు నడిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.