ఇప్పటికే తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.బీజేపీ రాజకీయ వ్యూహాలను తిప్పి కొట్టలేక తలలు పట్టుకుంటోంది.
రాజకీయంగా బీజేపీ , టిఆర్ఎస్ ను పూర్తిగా టార్గెట్ చేసుకోవడం, దానికి టిఆర్ఎస్ గట్టిగా కౌంటర్ ఇస్తున్న సమయంలోనే ఇప్పుడు అధికార పార్టీకి చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.మృదు స్వభావిగా ముద్రపడిన వెంకటేశ్వరరావు కు ఇప్పుడు ఆయన కుమారుడు వనమా రాఘవ పై వస్తున్న ఆరోపణలు పెద్ద తలనొప్పిగా మారాయి.
మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న వనమా వివాదరహితుడిగా పేరు పొందారు.గెలిచినా, ఓడినా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వస్తూ ఉండడం ఆయనకు కలిసి వస్తోంది.
నాలుగు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు.అయినా ఆయన పై ఎటువంటి ఆరోపణలు రాలేదు.
అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గానూ పనిచేసిన ఆయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి తరువాత టిఆర్ఎస్ లో చేరారు.అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆయన కొనసాగుతుండగా, ఆయన కుమారుడు వనమా రాఘవ సెటిల్మెంట్ల వ్యవహారం వివాదాస్పదం అయ్యింది.ఇప్పటికే ఆయన పై రెండు కేసులు నమోదయ్యాయి. రాఘవ కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది.ఇప్పటికే ఆయన కారణంగా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కోవడంతో, వారంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు.ఈ ప్రభావం వలన వెంకటేశ్వరరావు పై పడింది.
ఆయనను రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అలాగే టిఆర్ఎస్ అధిష్టానం కూడా వనమా వెంకటేశ్వరరావు పై అసంతృప్తితో ఉంది.వనమా రాఘవ ను ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే తాజాగా కవల పిల్లలతో సహా ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వనమా రాఘవ అనే ఆరోపణలు వస్తున్నాయి.
దీనికి సంబంధించిన సెల్ఫీ వీడియో కూడా వెలుగు చూడడం సంచలనంగా మారింది.ఓ సమస్యను పరిష్కరించాల్సిందిగా సదరు వ్యాపారిని వనమా రాఘవ ను కోరగా, దానికి ఆయన భార్యను పంపితే పనవుతుంది అంటూ రాఘవ చెప్పడం తోనే ఆ కుటుంబం మనస్థాపానికి గురై ఆత్మహత్య కు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ వ్యవహారం టీఆర్ఎస్ కు ఇబ్బందులు తెచ్చి పెడతాయి అనే ఉద్దేశంతో ఆ పార్టీ పెద్దలు ఉన్నారట అందుకే రాఘవ ను అరెస్టు చేసే విషయంలో తాము కలుగజేసుకోకూడదని నిర్ణయించుకోవడంతో, రాఘవ అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది. అదే కనుక జరిగితే వనమా వెంకటేశ్వరరావు రాజకీయ జీవితం పై పెద్ద మచ్చే పడుతుంది.
అలాగే టిఆర్ఎస్ లో ఆయనకూ ప్రాధాన్యం తగ్గుతుంది అనడంలో సందేహం లేదు.