కేంద్రం ప్రభుత్వంలో దేశంలోని విద్యాసంస్థల్లో సమూల మార్పులు చేస్తోంది.అందుకోసం జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహిస్తోంది.
అందుకోసం 75 ఆటలను స్కూల్ లో ఆడించాలని ఆదేశాలు జారీ చేసింది.దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇక నుంచి ఖోకో, కర్రాబిళ్ల, కబడ్డీ ఆటలను తప్పనిసరి చేసింది.
ఆటల ద్వారా పిల్లల్లో మంచి ఉత్సాహం, మానసిక ఒత్తిడి తగ్గి చదువుపై ఆసక్తి కలుగుతుందని కేంద్రం తెలిపింది.కర్రాబిళ్ల, కుంటుడు, పతంగులు ఎగురవేయడం, సంతాళ్ వంటి ఆటలకు ప్రాముఖ్యత తగ్గిందని, అవి కాలగర్భంలో కలిసిపోతున్నాయని పేర్కొంది.
పాఠశాలల్లో ప్రతి వ్యాయామ ఉపాధ్యాయుడు ఈ ఆటలను విద్యార్థులకు నేర్పించాలని చెప్పింది.మొత్తం 75 ఆటలను పిల్లలకు నేర్పించాలని కేంద్రం యోచిస్తోంది.దీంతోపాటు ఆయుర్వేద, లోహ శాస్త్రాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది.విద్యార్థులు చిన్నతనం నుంచే భారతీయ సంస్కృతి, కళలు, ఆటలు, శాస్త్రాల గురించి తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.