ఇటీవల బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్,మహా సర్కార్ శివసేన లకు మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కంగనా ముంబై నగరం మరో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా తయారైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
దీనితో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తో కంగనా పై విమర్శలు,వ్యతిరేకత వ్యక్తం అయ్యాయి.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా సైతం కంగనాకు అనుకూలంగా, వ్యతిరేకంగా మారిపోయి కామెంట్లు పెట్టాయి.
అయితే మహారాష్ట్ర ప్రభుత్వం, అలానే ముంబై పోలీసుల తీరుపై ఆమె తీవ్ర విమర్శలు చేసిన గంటల వ్యవధిలో, నిబంధనలకువిరుద్ధంగా అక్రమ నిర్మాణాలు సాగించిందంటూ, ఆమె ఆఫీసులు బీఎంసీ అధికారులు కూలగొట్టారు కూడా.
అయితే ఇంత జరిగినా కూడా కంగనా మాత్రం ఏమాత్రం తొణకలేదు సరికదా,మరిన్ని విమర్శలకు దిగింది.
ఇంతగా కక్షపూరితంగా మహా సర్కార్ వ్యవహరించినప్పటికీ కంగనా మాత్రం ఏమాత్రం భయపడకుండా మరింత పోరాడడానికి సిద్ధమైంది.దీనికి తోడు ఆమెకు బీజేపీ కూడా అండగా నిలవడం తో మరింత విమర్శల ధాటికి దిగింది.
అయితే ఇప్పుడు తాజాగా మహా సర్కార్ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం కోసం ఆమె మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ అపాయింట్ మెంట్ కోరగా,ఆమెకు అపాయింట్ మెంట్ కూడా దొరికినట్లు తెలుస్తుంది.
దీనితో నేటి సాయంత్రం కంగనా స్వయంగా గవర్నర్ కోషియారీ ని కలిసి భేటీ అయి, తనకు జరిగిన అన్యాయం, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వ వైఖరి గురించి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
సుశాంత్ మృతి చెంది నెలలు గడుస్తున్నప్పటికీ కంగనా,శివసేన నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు.రోజు రోజుకు వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.