ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సి.బి.
ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ జీవితం డైలమాలో పడింది.ఆయన ఉద్యోగంలో ఉన్న సమయంలో నీతి నిజాయితీకి మారుపేరుగా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన వ్యవహరించిన తీరుకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించింది.ఆ కేసులో పగడ్బందీ వ్యూహాలతో జె.డి ముందుకు వెళ్ళడంతో, జగన్ 16 నెలల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది.ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది.
తర్వాత ఆయన సీబీఐ నుంచి రిలీవ్ అయ్యి మహారాష్ట్ర క్యాడర్ కు వెళ్లిపోయారు.ఇక ఆ తర్వాత తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి కొంతకాలం పాటు రైతుల పక్షాన నిలబడుతూ వచ్చారు.
సొంతంగా పార్టీ పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.దాదాపు పార్టీ పేరు ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, జేడీ ఆ దిశగా అడుగులు వేయకుండా అనూహ్య పరిణామాల మధ్య జనసేన పార్టీలో చేరారు.
ఆ పార్టీ తరఫున విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.కొంతకాలం పాటు జనసేన లోనే ఉన్నా లేనట్టుగానే వ్యవహరించి చివరకు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఇక అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరతారని పెద్దఎత్తున ప్రచారం జరిగినా, ఆయన ఆ దిశగా అడుగులు వేయలేదు.కొద్ది రోజులుగా ఆయన అదేపనిగా వైసీపీని, సీఎం జగన్ ను పొగుడుతూ జగన్ నిర్ణయాలకు మద్దతు పలుకుతూ వస్తున్నారు.
దీంతో ఆయన వైసీపీలో చేరబోతున్నారు అంటూ కథనాలు మొదలయ్యాయి.
అయితే జగన్ జేడి ల బంధం కేవలం నిందితుడు పోలీస్ అధికారి గానే జనాలు చూస్తున్నారు.అయితే ఈ విషయం పైన జె డి క్లారిటీ ఇస్తూ, తాను ఒక అధికారిగా ఎన్నో కేసుల్లో భాగంగా జగన్ కేసుని కూడా విచారించాలని, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదని చెబుతూ జగన్ పరిపాలన మెచ్చుకుంటున్నారు.అంతేకాకుండా జగన్ నిర్ణయాలు అన్నీ బాగున్నాయి అంటూ జెడి తన మనసులో మాటను బయటపెట్టారు.
దీంతో జెడి వైసీపీలో చేరబోతున్నారా అంటూ ప్రచారం జరిగింది.అయితే జెడి ని చేర్చుకునే విషయంలో వైసీపీ అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
పోనీ టీడీపీలో చేరతార అంటే అప్పట్లో జగన్ అక్రమాస్తుల కేసులో టిడిపి ప్రోద్బలంతోనే జెడి ఆ విధంగా వ్యవహరించారనే నిందలు వస్తాయని, అది కాకుండా టిడిపికి రాజకీయ భవిష్యత్తు లేదనే ఒక బలమైన అభిప్రాయం తో ఆ పార్టీ లో చేరేందుకు ఆయన వెనకడుగు వేస్తున్నారట.
ఇప్పటికే జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన జెడికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ బిజెపి.
ఇప్పటికే బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిన ఆయన ఆ పార్టీలోకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.దీంతో జేడీ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది.
జేడీ కి ఏపీ లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న సమయంలో ఆయన జనసేన పార్టీలో చేరి రాంగ్ స్టెప్ వేసి తన రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టుకున్నారు అంటూ ఆయనపై చాలామంది కి కలుగుతున్న అభిప్రాయం.