ఏపీలో 2024 లో జరగబోయే ఎన్నికల పై జనసేన భారీగానే ఆశలు పెట్టుకుంది.పొత్తు పెట్టుకుని ఎన్నికలను ఎదుర్కొంటారా ? ఒంటరిగా పోటీ చేస్తారా అనే విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీ లేకపోయినా , ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తామని, కింగ్ మేకర్ అవుతామని పవన్ భావిస్తున్నారు. కనీసం 40 స్థానాల్లో జనసేన దక్కించుకున్నా, ఏపీ రాజకీయాలను శాసించ వచ్చనే లెక్కల్లో పవన్ ఉన్నారు.ఇప్పటికే ప్రజా క్షేత్రంలో అడుగు పెడుతూ, ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు.అయితే 2024 ఎన్నికల్లో పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే ఆశక్తి అందరిలో ఉంది.2019 ఎన్నికల్లో పవన్ గాజువాక , భీమవరం నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.
కానీ ఆ రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెందారు.దీంతో ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాము అనుకున్న నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నుంచి పవన్ బరిలోకిి దిగబోతున్నట్లు తెలుస్తోంది.ఈ నియోజకవర్గంలో జనసేనకు బలమైన కేడర్ ఉండడంతో పాటు , గట్టిపట్టు ఉంది.2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన మాకినీడు శేషు కుమారి 28 వేల ఓట్లను సాధించారు.
వైసిపి గాలి తీవ్రంగా ఉన్నా, ఆమెకు ఈ స్థాయిలో ఓట్లు రావడం అషామాషి కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం పిఠాపురం వైసిపి ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. స్థానికంగా ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వివిధ సర్వేలలోనూ బయటపడిన విషయాన్ని జనసేన శ్రేణులు హైలెట్ చేస్తున్నాయి.
ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో అనేక యూట్యూబ్ ఛానళ్లు సర్వేలు నిర్వహించగా, పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీ రావడం ఖాయం అనే విషయం తేలిందట.దీంతో పవన్ ఈ నియోజకవర్గాన్ని ఫైనల్ చేసుకున్నట్టుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.