అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వున్న హిందూ దేవాలయాలపై ఇటీవలి కాలంలో దాడులు ఎక్కువౌవుతున్నాయి.అగంతకులు ఆలయాలపై దాడులు చేయడంతో పాటు దోపిడీలకు పాల్పడుతున్నారు.
ఈ పరిణామాలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది.దీనిలో భాగంగా న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలలోని హిందూ ఆలయాల్లో ఇటీవల పూజారులను బెదిరించి పగటిపూటే దోపిడీకి పాల్పడిన వివరాలను అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
వీటి ప్రకారం.కొందరు మహిళలు ముసుగులు ధరించి భక్తులు, సందర్శకుల మాదిరిగా ఆలయాల్లోకి ప్రవేశిస్తున్నారు.అనంతరం పదునైన కత్తులతో అక్కడి పూజారులను, ఆలయ సిబ్బందిని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నారు.ఈ క్రమంలోనే న్యూజెర్సీలోని ఒక ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో ముసుగులు ధరించిన మహిళలు పట్టుబడ్డారు.
ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వున్న హిందూ దేవాలయాల వద్ద భద్రతను పెంచాలని హెచ్ఏఎఫ్ అమెరికా ప్రభుత్వాన్ని కోరుతోంది.ఆలయాల వద్ద తప్పనిసరిగా భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది.
గుర్తు తెలియని భక్తులను , సందర్శకులను ప్రశ్నించేందుకు వాలంటీర్లకు అధికారం ఇవ్వాలని కోరింది.
2019లో న్యూజెర్సీ మాహ్వాలోని హిందూ సమాజ్ ఆలయంలో 43 ఏళ్ల పూజారి దేవేంద్ర శుక్లాపై దాడి చేసిన కొందరు వ్యక్తులు అతని కుమార్తె ముందే జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన ఘటన అప్పట్లో కలకలం రేపింది.ఇండో అమెరికన్ రాజకీయ వేత్త, ప్రముఖ హిందూ నాయకురాలు తులసి గబ్బార్డ్ సైతం తాను హిందూ ఫోబియాకు బాధితురాలినేనని పలు సందర్భాల్లో వాపోయారు.