ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయాలని దాదాపు కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయిపోయింది.ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అందర్నీ ఆయన కలుస్తున్నారు.2024 ఎన్నికలే టార్గెట్ గా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలి అనుకోవడం వెనుక కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ ను దృష్టిలో పెట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ని ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర – తెలంగాణ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.2014 ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టి దారుణంగా ఓటమి చెందారు.ఇక ఆ తర్వాత నుంచి ఆయన సైలెంట్ గానే ఉన్నారు.
ఒక దశలో ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది.కానీ ఆయన మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు.అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంది.
ఈ క్రమంలోనే జగన్ కు పాత ప్రత్యర్థి అయిన కిరణ్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించడం ద్వారా, రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ పట్టు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని, అలాగే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ వైసీపీ ల మధ్య పొత్తు ఖరారు కాబోతోంది అనే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక చేయబోతోందట.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సాకే శైలజానాథ్ చాలా కాలంగా పార్టీలో యాక్టివ్ గా ఉండటం లేదు.ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ కు ఊపు తీసుకురావచ్చని, రెడ్డి సామాజిక వర్గం ను పూర్తిగా జగన్ వైపుకు వెళ్లకుండా చీలిక తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎత్తుగడ వేసినట్లుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.