కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ రేపు భేటీ కానుంది.ఈ భేటీలో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న మూడు ఎంపీ టికెట్ల కేటాయింపు పై ఒక క్లారిటీ కి రానున్నారు .
ఢిల్లీలో జరగబోతున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ( Congress Central Election Committee ) భేటీలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఢిల్లీకి వెళ్లారు.
పార్టీ అగ్ర నేతలను కలిసి ఆయా నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు.సీఈసీ సమావేశానికంటే ముందుగానే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నట్లు సమాచారం.
అలాగే భువనగిరిలో పార్టీ నిర్వహించే బహిరంగ సభకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్ర నేతలను రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు గాను 14 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో , ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్ లో ఉన్నాయి.దీంతో వీటిని ఎవరికి కేటాయించాలనే విషయంలో గత కొద్ది రోజులు కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటుపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు.
ఈ టిక్కెట్ ను తన భార్యకు ఇవ్వాలంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) కోరుతున్నారు.అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Minister Ponguleti Srinivas Reddy ) తన సోదరుడికి ఇవ్వాలని కోరుతుండగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో పాటు ఇదే జిల్లాకు చెందిన ఓ బడా పారిశ్రామిక కూడా కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద రాయబారాలు చేస్తున్నారట.అలాగే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తో పాటు , మరో ఇద్దరు బీసీ నేతలు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి , వెలిచాల రాజేందర్ రావు , తీన్మార్ మల్లన్న గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఆలీ మస్కతీ పోటీ చేస్తారని అంతా అనుకున్నా.ఆయన పోటీ చేసేందుకు అంత ఆసక్తి చూపించకపోవడంతో, అక్కడ మరో నేతను ఎంపిక చేసే విషయంపై దృష్టి సారించారు.ఏది ఏమైనా రేపు జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో పెండింగ్ సీట్ల పై ఒక క్లారిటీ రాబోతూ ఉండడంతో పూర్తిస్థాయి జాబితాను రేపు కాంగ్రెస్ ప్రకటించబోతోంది.