నిషేధిత ఉగ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా – ఐ) చైర్మన్‌గా వున్నారన్న ఆరోపణలపై యూకేలో వుంటున్న భారత సంతతి డాక్టర్‌ను భారత్‌కు అప్పగించాలన్న ప్రక్రియపై విచారణ జరుగుతోంది.ఈశాన్య ఇంగ్లాండ్‌లో నివసిస్తోన్న అస్సాంకు చెందిన 75 ఏళ్ల వైద్యుడు డాక్టర్ ముకుల్ హజారికా తనను భారతదేశానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం లండన్‌లోని కోర్టుకు హాజరయ్యాడు.
కౌంటీ డర్హామ్‌లో జనరల్ ప్రాక్టీషనర్‌గా వున్న డాక్టర్ ముకుల్ హజారికా.భారత్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉల్ఫా ఐకు ఛైర్మన్‌గా వున్నారన్న అభియోగాలపై తమకు అప్పగించాల్సిందిగా భారతీయ దర్యాప్తు అధికారులు యూకే ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
భారత ప్రభుత్వం తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) .వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో జిల్లా జడ్జి మైఖేల్ స్నో ఎదుట విచారణకు హాజరైంది.ఉగ్రవాద శిబిరాలను నిర్వహించడం, ఉగ్రవాదానికి క్యాడర్‌ను రిక్రూట్ చేసుకోవడం వంటి అభియోగాలు డాక్టర్ ముకుల్‌పై వున్నాయని సీపీఎస్ తెలిపింది.భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, యుద్ధం చేసేలా పలువురిని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు అతనిపై వున్నట్లు సీపీఎస్ న్యాయవాది బెన్ లాయిడ్ వాదనలు వినిపించారు.
అభిజీత్ అసోమ్ అని మరో పేరున్న హజారికా 2016లో మయన్మార్‌లో జరిగిన ఒక శిబిరంలో ఉల్ఫా (ఐ) ఛైర్మన్ హోదాలో ప్రత్యేక సార్వభౌమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సాయుధ పోరాటాన్ని ప్రోత్సహించేలా ప్రసంగించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.న్యాయస్థానానికి సమర్పించిన పత్రాలలో హజారికా ఉగ్రవాద కార్యకలాపాలను ధృవీకరించేలా ఒక దర్యాప్తు అధికారి అఫిడవిట్ వుందని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించింది.
హజారికా తరపు న్యాయవాది బెన్ కూపర్ మాట్లాడుతూ.ప్రత్యేకమైన సాక్ష్యం లేనందున అతనిపై కేసు పెట్టడం కుదరదని వాదించారు.అతని ఉల్ఫా (ఐ) సంస్థ.ఉల్ఫా వలే నిషేధిత సంస్థ కాదని.
స్వయం ప్రకటిత ఛైర్మన్‌గా దర్యాప్తు సంస్థలు ఆరోపించిన అతని పాత్ర కానీ, మయన్మార్ స్పీచ్‌కు సంబంధించిన కంటెంట్ కూడా అందుబాటులో లేదని కూపర్ వాదించారు.అంతేకాకుండా.
అస్సాం వాచ్ ఏర్పాటుతో సహా క్రియాశీల మానవ హక్కుల న్యాయవాదిగా హజారికా కార్యకలాపాలను కోర్టుకు అందించారు.భారత దర్యాప్తు అధికారులు హజారికాను లక్ష్యంగా చేసుకున్నారని బెన్ కూపర్ వాదించారు.
డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే.అస్సాం ప్రజల మానవ హక్కులను రక్షించడానికి ముకుల్ కట్టుబడి వున్నారని కూపర్ చెప్పారు.
భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ దేశ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ కేసు దర్యాప్తు చేపట్టిందని బెన్ కూపర్ పేర్కొన్నారు.భారత్‌కు ముకుల్‌ను అప్పటించినట్లయ్యితే అతనికి పెరోల్ సైతం లేకుండా జీవిత ఖైదు విధించే అవకాశం వుందని బెన్ కూపర్ ఆరోపించారు.ఇదిలా వుండగా.హజారికాను గతేడాది జూలైలో యూకే అప్పగింత విభాగం అధికారులు అరెస్ట్ చేశారు.నాటి నుంచి ఆయన ఎలక్ట్రానిక్ ట్యాగ్ కర్ఫ్యూ నిబంధన ప్రకారం బెయిల్‌పై వున్నారు.అప్పగింతపై విచారణ జరుగుతున్న సమయంలో ముకుల్ లండన్‌లో వుండేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.
దీనిపై వచ్చే వారం కూడా విచారణ జరగనుంది.