ఇప్పటి వరకు భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరంటే టక్కున వినిపించే పేరు చైనా.సరిహద్దుల్లో ఉద్రిక్తతలున్నా.
నిత్యం కయ్యానికి కాలు దువ్వుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపార సంబంధాలు మాత్రం బలంగా వున్నాయి.దీని విలువ ఏయేటి కాయేడు పెరుగుతూనే వస్తోంది.
డ్రాగన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో స్మార్ట్‌ఫోన్‌లు, ఆటోమొబైల్స్ పరికరాలు, టెలికాం డివైజెస్, ప్లాస్టిక్, మెటాలిక్ వస్తువులు, క్రియాశీల ఔషధ పదార్థాలు, ఇతర రసాయనాలు ఉన్నాయి.మనదేశం నుంచి ఇనుము, ఉక్కు, మత్స్య ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులను చైనా దిగుమతి చేసుకుంటోంది.
అయితే తాజాగా చైనాను తలదాన్ని భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది.2021-22లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇదే సమయంలో 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఇరుదేశాల మధ్య 80.51 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.అటు 2021-22లో అమెరికాకు భారత్ ఎగుమతుల విలువ 76.11 బిలియన్ డాలర్లకు చేరగా.దిగుమతుల విలువ 43.31 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం.ఇక ఇప్పటి వరకు మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వున్న చైనా విషయానికి వస్తే.2021-22లో భారత్ – చైనాల మధ్య 115.42 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగగా.అంతకుముందు 2020-21లో 86.4 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగినట్లు గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.
అంతర్జాతీయ స్థాయి సంస్థలు చైనా మీద ఆధారపడడం తగ్గించి.భారత్ లాంటి దేశాలతో వాణిజ్యానికి మొగ్గుచూపుతుండటం వల్లే మార్పులు చోటు చేసుకున్నాయని నిపుణులు అంటున్నారు.రాబోయే రోజుల్లో అమెరికా- భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు.ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన క్వాడ్ దేశాధినేతల సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా .అమెరికా నేతృత్వంలో ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్) ఏర్పాటు కానుంది.దీని ద్వారా ఇరుదేశాల ఆర్థిక బంధాలు మరింత బలోపేతం అవుతాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో చైనాతో వ్యాపార సంబంధాలు బలంగానే వున్నాయి.ప్రస్తుతం భారత్‌తో వాణిజ్యం విషయంలో చైనా – అమెరికాల మధ్య తేడా కేవలం నాలుగు శాతమే.దీనిని డ్రాగన్ అధిగమించడం పెద్ద విషయం కాదని పలువురు అంటున్నారు.2013-14 నుంచి 2017-18 మధ్యకాలంలో భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనా కొనసాగింది.గతంలో యూఏఈ ఈ స్థానంలో వుండేది.ఆ తర్వాతి స్థానాల్లో సౌదీ అరేబియా, ఇరాక్, సింగపూర్ నిలిచాయి.