బహిరంగంగా ఎస్సీలపైన ఎస్.ఐ దురుసుగా ప్రవర్తించడం సరైనది కాదు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ బహిరంగంగా ఎస్సీలపైన నేలకొండపల్లి ఎస్.
ఐ స్రవంతి రెడ్డి దురుసుగా ప్రవర్తించడం సరైనది కాదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులు పగిడికత్తుల నాగేశ్వరరావు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారంన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినటువంటి ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన సంఘటనపై కెవిపిఎస్ జిల్లా ప్రతినిధి బృందం స్వయంగా బాధితులను, అక్కడ ఉన్న సాక్షులను జరిగిన వాస్తవ విషయాలను అడిగి తెలుసుకున్నారు.ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎస్సీలోని ఉప కులమైన బైండ్ల కులస్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే సందర్భంలో ఎస్సై స్రవంతి రెడ్డి నిమజ్జన ర్యాలీని అడ్డుకొని గ్రామ రోడ్లమీద డాన్సులు ఏందిరా.
తాగిన నా కొడుక్కుల్లారా.అంటూ బూతులు తిట్టారని దీంతో మా ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ బాధితులు తెలిపారు.75 ఏళ్ళ స్వతంత్ర్యం తర్వాత కూడా దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు రాజ్యాంగ హక్కులను కాపాడవల్సిన పోలీసు అధికారులే మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని వారు దుయ్యబట్టారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులచే సమగ్రంగా విచారణ జరిపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధితులను పరామర్శించిన వారిలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మట్టి దుర్గాప్రసాద్, సంఘం మండల కార్యదర్శి ముత్తవరపు కిషోర్, బాధితులు చిన్నపొంగు వీరస్వామి, సోడేపొంగు వెంకటేష్, శ్రీకాంత్, శ్రీరామ్, తిమ్మిడి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.